Nagababu
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆ మధ్యే ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమన్న ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబే అఫీషియల్‌గా నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ..ఇప్పటివరకు నాగబాబుకు అమాత్య యోగం దక్కలేదు.
అయితే నాగబాబు కూడా మంత్రి అయితే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని..పవనే నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోకుండా ఆపారన్న గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. ఆయన పదవీకాలం 2031 మార్చి 30 దాకా ఉంది. అయితే 2029 ఎన్నికల్లో నాగబాబు పోటీ చేస్తారా.? లేదా.? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ ఒక సీటు చూసుకుని పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం సాగడమే ఇందుకు కారణం. (Nagababu)
Also Read: BJP: తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఎనిమిది మంది ఎంపీల్లో ఆ ముగ్గురి రూటే సెపరేటు..!
జనసేన పార్టీని పటిష్టం చేయడంలో నాగబాబు కీరోల్ ప్లే చేశారు. మెగా అభిమానులను ఒక తాటిపైకి తీసుకురావడం..ఎప్పటికప్పుడు క్యాడర్‌తో సమావేశాలు పెడుతూ వారిని పార్టీరి చేరువ చేయడంలో నాగబాబు పాత్ర ప్రత్యేకం. అలాంటి నాగబాబు తప్పుకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు. 2019లోనే ఆయన నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి రెండు ప్రధాన పార్టీల మధ్య నిలిచి కూడా లక్షల్లో ఓట్లు సాధించారు. 2024లో అనకాపల్లి ఎంపీ టికెట్ కన్ఫామ్ అయినా..లాస్ట్ మినిట్‌లో పొత్తుల్లో సీటు త్యాగం చేయాల్సి వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు అసెంబ్లీకి పోటీ?
అయితే వచ్చే ఎన్నికల్లో నాగబాబు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే ఉత్తరాంధ్రలో పర్యటించి..ఎచ్చెర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల పరిధిలో క్యాడర్‌తో చర్చించారు. దాంతో నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. విశాఖలో పార్టీ క్యాడర్‌ని ఉద్దేశించి ఏ ఎన్నిక అయినా పోటీకి క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పారని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీ చేయాలని నాగబాబును జనసేన అభిమానులు కోరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ నాగబాబు మాత్రం తాను పోటీకి దూరంగా ఉంటానంటున్నారట.
వచ్చే ఎన్నికల నాటికి నాగబాబు ఏడు పదుల వయసుకు వస్తారని అంటున్నారు. అందుకే డైరెక్ట్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడం కంటే పార్టీ సేవకే అంకితం అవుతానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు అందరూ పోటీలో ఉంటే పార్టీకి పనిచేసే వారు ఒకరు ఉండాలనే ప్రతిపాదన ఉందట. నాగబాబు కూడా మెగా అభిమానులతో పార్టీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్‌కు అందుబాటులో ఉండటానికే ఇష్టపడుతున్నారట. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కూడా ఉండటంతో..2029 నాటికి ప్రోటోకాల్ పరంగా ఆయనకు వచ్చిన ఇబ్బందేమి లేదంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించేలా ఆయన అన్ని జిల్లాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేసే పనిలో ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నాగబాబు భావిస్తున్నప్పటికీ..పార్టీ కోరితే పోటీకి రెడీగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే 2026 జూన్‌లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ రాజ్యసభ సీటులో నాగబాబు పెద్దల సభకు వెళ్లి..తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం ఉంది. నాగబాబు రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటును బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది. రాబోయే రోజుల్లో మెగా బ్రదర్ డెసిషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.