BJP: తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఎనిమిది మంది ఎంపీల్లో ఆ ముగ్గురి రూటే సెపరేటు..!
రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సైతం ఈ మూడు గ్రూపుల్లో ఎందులోనూ చేరకుండా తమ సొంత ఇమేజీని పెంచుకునేందుకు పనిచేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
BJP: బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం సీన్ రివర్స్ నడుస్తోందట. దేశవ్యాప్తంగా బీజేపీ పరుగులు పెడుతుంటే..తెలంగాణలో మాత్రం గ్రూప్లుగా విడిపోవడంతో పార్టీ బలోపేతం కావడం లేదట. ఎవరికి వారు రాష్ట్ర పార్టీపైన ఆధిపత్యం కోసం, తమ మాట నెగ్గించుకోవడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఉన్న 8మంది ఎంపీల్లో నాలుగు గ్రూపులున్నాయట. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీపై తన పట్టును తప్పకుండా చూసుకుంటున్నారట.
ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు, మొత్తం నాలుగుసార్లు అధ్యక్షుడిగా పనిచేసి..రెండోసారి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి. దాంతో రాష్ట్ర పార్టీలో ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీపై పట్టును ఏ మాత్రం సడలకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎన్నికలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటులో ఆయన వర్గానికి భారీగా పదవులు దక్కాయట. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు పదిమందికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కిందంటే..కిషన్ మాట ఎంత చెల్లుబాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు కమలనాథులు. (BJP)
Also Read: హస్తం పార్టీ ఎమ్మెల్యేల సొంతూర్లలో షాకింగ్ రిజల్ట్స్..! ఇందుకేనా?
ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో తన అనుచరవర్గాన్ని పెంచుకుంటూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన వర్గం నేతలు ఉన్నారట. బండి సంజయ్ రాష్ట్ర పార్టీలో తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే వస్తున్నారట. మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో తాను చెప్పిన వారే లీడర్అన్నట్లుగా ప్రోత్సహిస్తున్నారట. తన లోక్సభ పరిధిలోనే ఉన్న హుజూరాబాద్ పైనా సంజయ్ మరింత పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఇక్కడి స్థానిక నేత అయిన మల్కాజిగిరి ఎంపీ ఈటల వర్గీయులకు దిక్కుతోచడం లేదనే టాక్ నడుస్తోంది.
బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా..
ఇక ఈటల రాజేందర్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేత.. రెండుసార్లు రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన లీడర్. రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతి జిల్లాలో ఆయనకు సొంత వర్గం అంటూ ఉంది. ఆయన వర్గం నేతలకు బీజేపీలో ఏదో ఒక స్థాయిలో పదవులు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట ఈటల. మల్కాజ్ గిరి ఎంపీగా కొనసాగుతూనే హుజురాబాద్, గజ్వేల్లో పట్టు కోల్పోకుండా తన వర్గాన్ని పెంచుకుంటూ వస్తున్నారట. హుజరాబాద్ లో వర్గపోరు పీక్ లెవల్‌కు చేరి బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా నడుస్తోందట గ్రూప్వార్. తెలంగాణ బీజేపీలో ఈ ముగ్గురు కీలక లీడర్లు..తమ వర్గం నేతలను ప్రోత్సహిస్తూ వస్తుండటంతో పార్టీ కోసం పని చేసే సామాన్య కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారట.
ఇక మరోవైపు రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ లు సైతం ఈ మూడు గ్రూపుల్లో ఎందులో చేరకుండా తమ సొంత ఇమేజీ పెంచుకునేందుకు పనిచేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినా నేతల తీరు మారడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా తమ వర్గం నేతలను, అనుచరులను ప్రోత్సహించడం పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రయారిటీ ఇవ్వాలని సీనియర్ నేతలు, సామాన్య కార్యకర్తలు కోరుతున్నారట. క్యాడర్ మనోగతం తగ్గట్లు నాయకులు పనిచేస్తారా? ఎప్పటిలాగే ఆధిపత్య పోరుతోనే కాలం వెళ్లదీస్తారా అనేది వేచి చూడాలి.
