కమలంతో కలిశాక పవర్‌ తగ్గిందా?

  • Publish Date - January 24, 2020 / 01:23 PM IST

జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. తన స్టేటస్‌ను తానే తగ్గించుకున్నట్టయ్యిందనే టాక్‌ మొదలైంది. ఇప్పటి వరకూ తన పార్టీకి తానే బాస్‌.. తాను చెప్పిందే ఫైనల్‌. కానీ.. బీజేపీతో కలిసిన తర్వాత తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన, జరుగుతోన్న పరిణామాలు చూస్తే అలానే కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో ముందుకెళ్లాలని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇరు పార్టీల ముఖ్యనేతలు రాష్ట్ర స్థాయిలో సమావేశమై అధికారికంగా ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటామన్నారు. సమన్వయం చేసుకొనేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పుడు ఆ కమిటీ ఏర్పాటైంది.

కమిటీలోనూ బీజేపీదే పైచేయి :
బీజేపీ, జనసేన కో ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వ్యవహరిస్తారు. కో కన్వీనర్‌గా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉంటారు. అంటే కమిటీలో కూడా బీజేపీదే పైచేయి ఉంటుందనే విషయం తేలిపోయిందని జనాలు అనుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు మాట్లాడాల్సిందే తప్ప.. తనంతట తానుగా నిర్ణయాలు తీసుకొని ప్రకటించేందుకు వీల్లేకుండా పోయిందని గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీతో కలిసి వెళ్లి ఏదో సాధించేద్దామనుకున్న పవన్‌కు ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

ఢిల్లీ వెళ్లిన తర్వాత పవన్‌ మాట్లాడిన దానికి అక్కడ బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు పొంతన కూడా కుదరడం లేదంటున్నారు జనాలు. అమరావతి రైతులతో పవన్‌ మాట్లాడుతూ జగన్‌ సర్కారును కూల్చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఢిల్లీలో బీజేపీ నాయకుడు రఘురామ్‌ మాత్రం ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చేయడం తమ అభిమతం కాదంటూ భిన్నంగా మాట్లాడారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, బీజేపీ నేతలు జీవీఎల్‌ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ కూడా పవన్‌ మాటలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడంతో పవర్‌స్టార్‌ పవర్‌ తగ్గినట్టే ఉందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

అయోమయంలో పవన్ పరిస్థితి :
ఇక నుంచి పవన్‌ కల్యాణ్‌ బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. సమన్వయ కమిటీలో కూడా కో కన్వీనర్‌గా నియమించడంతో పవన్‌ స్థాయిని తగ్గించినట్టే అనుకోవలసి వస్తుందని అంటున్నారు. పవన్‌ పరిస్థితిని చూసిన సొంత పార్టీ నేతలు కూడా ఇలా జరిగిందేంటని అనుకుంటున్నారట.

ఇప్పుడు బీజేపీ చెప్పినట్టే నడుచుకుంటూ పోతే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు దేనికి సంకేతమో అర్థం కావడం లేదని అంటున్నారు. మొత్తం మీద బీజేపీతో జత కలసి ఏదో సాధించేద్దామనుకున్న పవన్‌ పరిస్థితి.. ఇప్పుడు ఏమవుతుందో తెలియని అయోమయంలో పడిందని జనాలు అనుకుంటున్నారు.