ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో రాజకీయాల జోరు.. హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు జరగగా.. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలు జరగవలసిన పరిస్థితి ఉండగా.. కృష్ణా జిల్లాలో ఓ అభ్యర్థి ఓకే రోజు సర్పంచ్‌గాను.. తల్లిగాను అయ్యింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిడ్డొచ్చిన వేళా విశేషం అంటారు కదా? అదేనేమో.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థి లీలా కనకదుర్గ ప్రత్యర్థులపై 689 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తొమ్మిది నెలల గర్భిణిగా ఉండి.. నామినేషన్ వేసి ప్రచారంలో తిరిగి చివరకు సర్పంచ్‌గా విజయం సాధించింది. సరిగ్గా పోలింగ్ రోజు ఓటు వేశాక పురిటి నొప్పులు రావటంతో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. అక్కడ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డొచ్చిన వేళే.. అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో లీలా కనకదుర్గ విజయం సాధించగా.. సర్పంచి పదవి తన బిడ్డ తెచ్చిన అదృష్టమేనంటూ లీలా సంబరపడిపోతోంది.
కోరుకల్లు గ్రామంలో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు అవగా.. బట్టు లీలాకనకదుర్గ సర్పంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తొమ్మినెలల గర్భిణిగా ఉండి.. కడుపులో బిడ్డను మోస్తూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. తాను ఓటు హక్కు వినియోగించుకున్నది ఒక్కసారేనని.. రెండో సారి తన ఓటు తనకే వేసుకునే అవకాశం వస్తుందని ఊహించలేదని లీలా అంటున్నారు. సర్పంచ్‌గా గెలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.