Green Ammonia Project Representative Image (Image Credit To Original Source)
Green Ammonia Project: క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ ఒక చారిత్రక అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే భారీ పరిశ్రమకు కాకినాడ వేదిక కాబోతోంది. శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఏడాది క్రితమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది. 2027 చివరి నాటికి ప్రాజెక్ట్ నుంచి ఉత్పిత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు.
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత టెక్నాలజీ..
శనివారం ఉదయం 10.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 11.20 నిమిషాలకు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత టెక్నాలజీతో పని చేసే ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీరణంలో గతంలో నాగార్జున ఫర్టిలైజర్స్ ఉన్న ప్రదేశంలో ఈ కొత్త ప్లాంట్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2600 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగని..
బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలతో తయారు చేసే గ్రే బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా తయారయ్యే ఈ ఇంధనం పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించదు. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత తరుణంలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా భవిష్యత్ ఇంధనాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ తో పాటు కాకినాడలోనే సుమారు 2వేల కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ను కూడా ఏఎం సంస్థ ఏర్పాటు చేస్తోంది.
Also Read: గంటాకు గుడ్‌టైమ్ స్టార్ట్ అయినట్లేనా? త్వరలో పెద్ద పోస్ట్ దక్కబోతోందా? ఏంటా పదవి..