YSRCP-YS Jagan
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు కూటమి కడితే.. మరోవైపు సింగిల్‌గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా ఈ నెల 16న అభ్యర్థుల ప్రకటన, ఆ వెంటనే 18నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్.
ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతుండటంతో.. సీఎం జగన్ ఇక రంగంలోకి దిగేందుకు ఫిక్స్ అయ్యారు. ఈనెల 16న వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ అనౌన్స్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఫైనల్ చేశారు. మార్చి 16న ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను జగన్ ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్.
సమన్వయకర్తల చివరి జాబితా
ఒకటి, రెండు మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను వైసీపీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆఖరి జాబితా విడుదల కానుందని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇక.. ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది వైసీపీ అధిష్టానం.
మొత్తం 12 లిస్ట్‌లను విడుదల చేసింది. ఇందులో ప్రకటించిన స్థానాలను కూడా మార్పులు చేసి కొత్త ఇంచార్జ్‌లను వైసీపీ నియమించింది. చిలకలూరిపేట, జీడీ నెల్లూరు, కందుకూరు, గాజువాక, మంగళగిరి, అవనిగడ్డ, అరకు, సత్యవేడు, ఎమ్మిగనూరు అభ్యర్థులను మార్చారు. మచిలీపట్నం, తిరుపతి ఎంపీ అభ్యర్థులను మార్చి కొత్త వారిని నియమించింది వైసీపీ అధిష్టానం.
2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను జగన్ ప్రకటించారు. 16వ తేదీ నాటి ప్రకటన తర్వాత జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన జగన్… మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 18న ప్రచారం మొదలుపెడతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
మళ్లీ సెంటిమెంట్‌గా..
మరోవైపు గత ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి 151 సీట్ల మార్క్ సాధించింది వైసీపీ. దీనితో మళ్లీ సెంటిమెంట్‌గా నర్సీపట్నం నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని పార్టీ నేతలు కొరుతున్నారు. దీంతో వైఎస్ ఫ్యామిలీకి సెంటిమెంట్ అయిన ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం లేదా ఇచ్ఛాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు జగన్. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్‌ను వైసీపీ సిద్ధం చేసింది.
రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. మూడు రీజియన్‌లు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఇలా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి రోజు 18న ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం మొదలవనుంది. అదే రోజు మొదటగా ఇచ్ఛాపురం లేదా నర్సీపట్నం, రెండోది విజయవాడ వెస్ట్, మూడోది నెల్లూరు రూరల్ ఇలా రోజుకి మూడు సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు సీఎం జగన్.
కాంగ్రెస్‌లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పక్రియలో ఏం జరుగుతుందో తెలుసా?