YCP Politics : ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్.. వారికి చెక్ పెట్టేందుకేనా?

YCP Chief YS Jagan : ఏపీలో స్థానిక సమరం ముంచుకొస్తోంది. ఈ నెలాఖరులో పురపోరు షెడ్యూల్ రాబోతుందన్న ప్రచారం వేళ.. నేతల జంపింగ్‌లు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. కీలక నేతలుగా పేరున్న వారు..అధికార టీడీపీలోకి వెళ్తుండటంతో అలర్ట్ అవుతోంది వైసీపీ అధినాయకత్వం.

YCP chief YS Jagan

YCP Chief YS Jagan : ఏపీలో స్థానిక సమరం ముంచుకొస్తోంది. ఈ నెలాఖరులో పురపోరు షెడ్యూల్ రాబోతుందన్న ప్రచారం వేళ.. నేతల జంపింగ్‌లు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. కీలక నేతలుగా పేరున్న వారు..అధికార టీడీపీలోకి వెళ్తుండటంతో అలర్ట్ అవుతోంది వైసీపీ అధినాయకత్వం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వలసలకు బ్రేకులు వేసేలా చర్యలు స్పీడప్ చేశారు వైసీపీ అధినేత. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి అలర్ట్ ఆపరేషన్‌ స్టార్ట్ చేశారు జగన్. చిన్న సీను తర్వాత ఆయన బాటలో ఇంకెవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నేతలను తాడేపల్లికి పిలిపించి మరీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు జగన్. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కొందరు వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీడీపీ, జనసేనతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. పిడుగుపాటు హెచ్చరిక

నిన్న మొన్నటి వరకూ కీలక నేతగా ఉన్న చిన్న సీను సడెన్‌గా టీడీపీలోకి వెళ్లడంతో ఆయన వర్గం పార్టీ నుంచి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు.? పార్టీ మారే ఆలోచనలో ఉన్నదెవరనే దానిపై ఆరా తీశారు జగన్. దీంతోపాటు ఉత్తరాంధ్రలో ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరిగిన నేపథ్యంలో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కడం.. పలువురు నేతల వారసుల వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో క్యాడర్ కాస్త నిరాశ చెందిన పరిస్థితి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో వాటన్నింటినీ సెట్ చేసేందుకు ఉత్తరాంధ్ర నేతలందరితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీరియస్‌గా ఉన్న జగన్.. ఉత్తరాంధ్ర పరిస్థితులపై కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారట. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణతో గంటకు పైగా అంతర్గతంగా చర్చించారు జగన్. ఓవరాల్‌గా పార్టీ పరిస్థితి ఎలా ఉందో సమీక్ష చేశారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆయా నియోజకవర్గ ఇంచార్జ్‌లతో కూడా వన్ టు వన్ మాట్లాడారు. ఎవరూ పార్టీ మారకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా విభేదాలతో పార్టీని బలహీన పరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు అంతా ప్రిపేర్ అవ్వాలని జగన్ సూచించారట.

ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు..ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారట. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసిన జగన్..శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం..మూడు ఉమ్మడి జిల్లాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా తన దగ్గరున్న నివేదికల ఆధారంగా నేతలను వివరాలు అడిగి తెలుసుకొని అంతా సెట్ చేయాలని ఆదేశించారట. విజయనగరం జిల్లాలో మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడిన తర్వాత ఏర్పడిన పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారట. ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో..మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలపై నేతలకు సూచనలు చేశారట.

ఇటు స్థానిక ఎన్నికలపై నేతలను దిశానిర్దేశం చేయడంతో పాటు..మెయిన్‌గా జంపింగ్‌లను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ సూచనలు చేశారట. చిన్నశ్రీను తర్వాత ఉత్తరాంధ్రలో మరెవరూ పార్టీ మారకుండా చూడాలని..ఎవరైనా అసంతృప్తిగా ఉంటే నేరుగా ముఖ్యనేతలే మాట్లాడి నచ్చజెప్పాలని సూచించారట. జగన్‌ దిశానిర్దేశంతో వలసలు ఆగేనా.? లోకల్ పోరులో వైసీపీ సత్తా చాటుతుందా.? లేదా.? అనేది వేచి చూడాలి మరి.