YCP leader Appalaraju
Seediri Appalaraju: మాజీ మంత్రి, వైసీపీ నేత సిదిరి అప్పలరాజు కూటమి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అన్యాయం అన్నారు. జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వేగంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఆ నిర్మాణాలు చివరి దశకు వచ్చాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేసి ప్రైవేటుకు అమ్మేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హైన్‌కెన్ సిఈవోతో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ.. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు..!
పీపీపీ పద్దతిలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 14ఏళ్ల అనుభవంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులకు మెడికల్ విద్య అదుతుంది. ప్రైవేటుకు అమ్మేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందడం కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాణంలో ఉన్న కాలేజీలను పూర్తిచేస్తే దాదాపు 2400 సీట్లు అదనంగా వచ్చేవి. కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామంటే ఈ ప్రభుత్వం వద్దు అనడం ఆశ్చర్యంగా ఉందని అప్పలరాజు అన్నారు. ప్రైవేటుకు అమ్మేస్తే వైద్య విద్య మాత్రమే కాదు.. పేదలకు వైద్యం కూడా అందుబాటులో ఉండదు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఇవ్వడం దారుణం. ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్లు క్లయిమ్స్ ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నారని అప్పలరాజు అన్నారు. చివరికి రూరల్ రోడ్స్ ను సైతం ప్రైవేట్ పరం చేస్తున్నారు. రూరల్ రోడ్స్ కి టోల్ ప్లాజా ఏంటి.. అంటూ అప్పలరాజు ప్రశ్నించారు. పోర్టులను హార్బర్లకు ప్రైవేటుకు ఇచ్చేస్తున్నారు. ఇది దారుణం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అంశాలపై మాట్లాడాలి.. ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకం అనే పవన్ కల్యాణ్ వీటిపై స్పందించాలని అప్పలరాజు డిమాండ్ చేశారు.
2027లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పీపీపీలు రద్దు చేస్తాం. మెడికల్ కాలేజీలు పీపీపీలో తీసుకునే వాళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ అప్పలరాజు సూచించారు. మంత్రి సత్యకుమార్ కు అవగాహన లేనట్లుంది. నిధులు మంజూరు, నిర్మాణాలు గురించి సరిగ్గా తెలుసుకోవాలి. మేము త్వరలోనే నిర్మాణంలో ఉన్న భవనాలను ప్రజలకు చూపిస్తాం అని అప్పలరాజు పేర్కొన్నారు.