చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు?- చంద్రబాబు ఆరోపణలపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సీరియస్

2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు.

Chevireddy Mohith Reddy Slams Chandrababu Naidu

Chevireddy Mohith Reddy : టీడీపీ అధినేత చంద్రబాబుకు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించడం తగదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు. లక్ష దొంగ ఓట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఫిర్యాదుపై న్యాయపోరాటం చేస్తామని మోహిత్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు తనకు తాత సమానులు అని, అలాంటి వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం బాధ కలిగిస్తుందన్నారు మోహిత్ రెడ్డి.

Also Read : రాష్ట్రంలో పరిస్థితులపై సీఈసీకి ఫిర్యాదు చేశాం.. వాళ్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దని కోరాం

”గతేడాది నవంబర్ లో కేవలం 4 రోజుల్లోనే టీడీపీకి చెందిన 14వేల 200 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే ఎన్నికల సంఘానికి, చంద్రగిరి అసెంబ్లీ పరిధిలోని 6 పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశాం” అని చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీతో సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామన్నారు చంద్రబాబు. వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేశారు చంద్రబాబు.