Chandrababu – Pawan Kalyan : రాష్ట్రంలో పరిస్థితులపై సీఈసీకి ఫిర్యాదు చేశాం.. వాళ్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దని కోరాం
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులే లక్ష్యంగా కేసులతో వేదిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

Chandrababu - Pawan Kalyan
Central Election Commission : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఓటరు జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొని రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేనలకు సీఈసీ 15నిమిషాలు సమయం కేటాయించింది. అరగంట పాటు సవివరంగా తమ ఫిర్యాదు అంశాలను ఈసీ దగ్గర చంద్రబాబు, పవన్ వివరించారు.అనంతరం చంద్రబాబు, పవన్ మీడియాతో మాట్లాడారు..
చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేదిస్తోందని, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిపై సీఈసీకి వివరించామని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఓట్లు తొలగించడం సరికాదని చెప్పామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారులను బెదిరింపులకు గురిచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితి ఏర్పడిందని, ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దొంగ ఓట్లపై సాక్ష్యాలతో సీఈసీకి వివరించామని అన్నారు. మా ఫిర్యాదుల పట్ల ఈసీ సానుకూలంగా స్పందించిందని చంద్రబాబు అన్నారు.
Also Read : Pawan Kalyan : గుంటూరు నగరంపై పవన్ ఫోకస్.. రెండు నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా
ప్రభుత్వం మారుతుంది : పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటంవల్లే విజయవాడకు రావడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారని, జనసేన తరుపునుంచి.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని సీఈసీకి తెలియజేశామని పవన్ అన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని, బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతుందని, వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల సమయంలో ఉపయోగించొద్దని సీఈసీకి తెలియజేశామని పవన్ చెప్పారు.
Also Read : జగన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు నామినేషన్ వేసే పరిస్థితికూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని, ఈ విషయాన్ని కూడా సీఈసీకి తెలియజేశామని పవన్ అన్నారు. ఏపీలో 1/4 దొంగ ఓట్లు చేర్చారని, కొన్ని ఆధారాలతో సీఈసీకి వివరించామని అన్నారు. రెండు నెలలముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేసిందని, ఈ విషయాన్నికూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని పవన్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను కోరడం జరిగిందని పవన్ చెప్పారు. మా విజ్ఞప్తులపై ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించిందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని పవన్ అన్నారు. కచ్చితంగా ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వం మారుతుందని పవన్ అన్నారు.