Pawan Kalyan : గుంటూరు నగరంపై పవన్ ఫోకస్.. రెండు నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా
గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను

Pawan Kalyan
JanaSena Party : ఏపీలో మరో మూడునాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఆయా పార్టీల అధినేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు పలు నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా గుంటూరు నగరంలో తాజా రాజకీయ పరిస్థితులపై పవన్ ఆరాతీశారు.
Also Read : వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే? సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు
గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నేరెళ్ల సురేష్ ను ప్రత్యేకంగా పిలిపించిన పవన్.. గుంటూరు నగరంలో తాజా రాజకీయాలపై చర్చించారు. గుంటూరు నగరంలో జనసేన వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీలు, నగరంలో కీలక నాయకుల పనితీరు గురించి ఆరా తీశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తీరును తెలుసుకున్నారు.
Also Read : అంగన్‌వాడీల వేతనాలు పెంపు, సమ్మెపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
గుంటూరు నగరంలోని రెండు నియోజక వర్గాలు పార్టీకి ఎంతో కీలకం అని, ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని పవన్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికలు పార్టీకి కీలకం అని, ప్రభుత్వంపైఉన్న ప్రజా వ్యతిరేకతను పోలింగ్ బూత్ వరకు తీసుకుని వెళ్ళాలని పవన్ అన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని నాయకులకు పవన్ సూచించారు. రాజకీయంగా ఏ చిన్న విషయం అయినా, ఇబ్బంది వచ్చినా పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని పవన్ స్పష్టం చేశారు. కచ్చితంగా గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో బలంగా జనసేన సత్తా చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ స్థానిక పార్టీ నేతలకు సూచించారు.