Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, 2019 కంటే ముందే జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారని.. అభివృద్ధి వికేంద్రీకరణలో కూడా జగన్ అమరావతిని వ్యతిరేకించలేదని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన కామెంట్స్ చేశారు.
అమరావతిపై గతంలో చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి మళ్లీ చెప్పారు. అమరావతి ప్రాంతానికి జగన్ వ్యతిరేకం కాదు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని అయితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని. రాజధానిపై జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలు వాస్తవం కాదా..? తొలి దశలో తీసుకున్న యాబై వేల ఎకరాల్లో రైతులకు చేసింది ఏమీలేదు.. రైతులకు ఇస్తామన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారా..? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మొదటి విడత రైతులకు న్యాయం చేయకుండా రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారంటూ విమర్శించారు. అమరావతి రాజధానికి లక్ష కోట్లు కావాలి.. అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన టీం స్కాములు చేస్తున్నారు. చంద్రబాబు అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని సజ్జల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
రాయలసీమ ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్‌పై ఇంత వరకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డితో చర్చించారా? లేదా..? రేవంత్ రెడ్డి చెప్పింది అబద్దం అయితే మీరెందుకు మాట్లాడటం లేదు..? రాయలసీమకు, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
తిరుమల మద్యం కేసులో రాజద్రోహం కేసు పెట్టారు. చేతిలో అధికారం ఉందని సామాన్యులపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా పొట్టేలును బలిచ్చారని వైసీపీ కార్యకర్తలను పోలీసులు రోడ్లపై తిప్పారు.. బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో ఏకంగా పొట్టేలు తలతో దండలు వేశారు.. అయినా పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వెహికల్స్ లేక రోడ్లపై నడిపించామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతుంది చంద్రబాబు అంటూ సజ్జల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు కోవిడ్ సమయంలో ఎక్కడ ఉన్నారు..? ఇప్పుడు వారంలో చంద్రబాబు ఎన్నిరోజులు అమరావతిలో ఉంటున్నారు.. వీకెడ్‌లో ఎందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్తున్నారు.. లోకేశ్, చంద్రబాబు వారంవారం ఎందుకు హైదరాబాద్ వెళ్లాలి..? అంటూ సజ్జల నిలదీశారు.