విశాఖలో హై టెన్షన్ నెలకొంది. ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్న బాబుకు సెగ తగిలింది. కాన్వాయ్‌ను వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. కొంతమంది చెప్పులు విసిరిందుకు ప్రయత్నించారు. దీంతో బాబు కాన్వాయ్ నిలిచిపోయింది. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. లాభం లేదనుకుని బాబు కాన్వాయ్‌ని వదిలి..పాదయాత్రగా ముందుకు కదులుతున్నారు. అక్కడ కూడా..అడ్డుకొనేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్య యాత్ర కోసం టీడీపీ అధినేత చంద్రబాబు 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం విశాఖ చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబుకు… టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అయితే… ఆయనను అడ్డుకుంటామని ముందునుంచి చెబుతున్న వైసీపీ కార్యకర్తలు అన్నంతపనిచేశారు. ఆయన వాహనం ఎదుట నిరసనకు దిగారు. ఆయనపై చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. నిరసనల మధ్యే ఎయిర్‌పోర్టున నుంచి బయటికి వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
టీడీపీ కార్యకర్తలు సైతం విశాఖ ఎయిర్‌పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతీయ రహదారి కూడలి వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఆందోళనలకు దిగారు. వైసీపీ కార్యకర్తలు.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.
మరోవైపు… తన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు చంద్రబాబు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన… తాను పర్యటించే రూట్‌లో రోడ్లు తవ్వారని ఆరోపించారు. అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. రోడ్లు తవ్వినా, ప్రొక్లైనర్లు అడ్డుపెట్టినా తన పర్యటన ఆగబోదన్న చంద్రబాబు… ఈ పర్యటనలో వైసీపీ లెక్కలు తేల్చేస్తానన్నారు. వైజాగ్ బ్రాండ్‌ను దెబ్బ తీసిన వైసీపీకి.. టీడీపీని ప్రశ్నించే అర్హత లేదన్నారు.