YS Jagan
మ్యానిఫెస్టో అంటే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్ అని ఏపీ సీఎం జగన్ నిర్వచనం ఇచ్చారు. చేసేవే చెప్పాలి… చెప్పామంటే అమలు చేసి తీరాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మ్యానిఫెస్టోకు ఐదేళ్లు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 99 శాతం అమలు చేశామని చెప్తున్న జగన్.. వచ్చే ఎన్నికలకు కొత్త మ్యానిఫెస్టోను సిద్ధం చేశారు.
2019 ఎన్నికల ముందు కేవలం రెండు పేజీ తోనే వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. నవరత్నాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలను పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుపైనే దృష్టి పెట్టారు జగన్. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అన్ని కార్యాలయాల్లో మ్యానిఫెస్టో కనిపించేలా పోస్టర్లు వేశారు.
మ్యానిఫెస్టోలోని అన్నీ అంశాలు అమలు చేశారు. మద్యపాన నిషేధం, CPS రద్దు వంటివి కుదరలేదనే అభిప్రాయం ఉంది. మద్యం షాపులు తగ్గించి రెట్లు పెంచడం, CPSకి బదులు GPSను తీసుకురావడం వంటివి చేశారు. అందుకే 99 శాతం అమలు చేశామని చెబుతున్నారు జగన్.
ఈసారి తీసుకురాబోయే మ్యానిఫెస్టో…. ప్రజలకు మరింత మేలు జరిగేలా ఉంటుందని జగన్ తెలిపారు. ఇప్పటికే మ్యానిఫెస్టో కసరత్తు పూర్తి చేశారు. ఇప్పడున్న నవరత్నాలతో పాటు మరికొన్ని చేర్చినట్లు తెలుస్తోంది. కొన్ని పథకాలకు ఆర్థిక సహాయాన్ని పెంచినట్లు సమాచారం. వృద్ధులు, వికలాంగుల పింఛన్…. 3 వేల నుంచి 4 వేలకు పెంచుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలు, యువత, రైతులకు మంచి జరిగేలా మరికొన్ని అంశాలు తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు..
టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించడంతో పాటు జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టో తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే..అందుకు దీటుగా వైసీపీ మ్యానిఫెస్టో తీసుకువస్తోందని చర్చ జరుగుతోంది.