వాళ్లను తిట్టవు నిన్నెలా నమ్మాలని అడిగారు.. జగన్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన వసంత కృష్ణప్రసాద్

ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే..

MLA Vasantha Krishna Prasad : మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో మైలవరం నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ముఖ్యనేతలతో వసంత సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వమించారు. ఈ సమావేశంలో తనకు పార్టీలో జరిగిన అవమానాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే.. రాజధాని మార్పుపై ఇక్కడ ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలి. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

ఆరోజు మమ్మల్ని వారించారు..
సీఎం జగన్ నివాసంలో సజ్జల, బొత్సలతో రాజధానుల సమావేశంలో మా అభిప్రాయం చెప్పమన్నారు. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పాను. రాజధాని మార్చాలనుకుంటే అసెంబ్లీ వైజాగ్ పంపి, సచివాలయం ఇక్కడ ఉంచితే సమస్య ఉండదని చెప్పాను.. కానీ పట్టించుకోలేదు. కొడాలి నాని మాట్లాడుతూ.. సీఎం నిర్ణయం ఫైనల్.. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పకూడదన్నారు. అంబటి లేచి ఆయన నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నాతోపాటు మల్లాది విష్ణు కూడా రాజధాని మార్చవద్దని చెప్పారు. మా అభిప్రాయాన్ని చెప్పకుండా అంబటి రాంబాబు మా గొంతు నొక్కుతున్నారని చెబితే సజ్జల, బొత్స, అంబటి మమ్మల్ని వారించారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

నిన్నెలా నమ్మాలని జగన్ అడిగాడు..
నేను ప్రజలకు సేవ చేయలేనప్పుడు నేనెందుకు ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నాను.. శాసనసభ్యులగా ఉండి ఏం చేయలేని పరిస్దితిలో ఉన్నాం. ఇక్కడ కొందరు దేవినేని ఉమాతో పరోక్ష సంబంధాలు నడిపారు. సర్నాల తిరుపతిరావు వార్డ్ మెంబర్ గా ఓడిపోతే జడ్పిగా గెలిపించింది నేను. మొన్న తిరుపతిరావు నాకు ఫోన్ చేసి మీ ఆశీస్సులు కావాలని అడిగాడు.. నేను పెంచిన మొక్కే నువ్వు తిరుపతిరావు.. నువ్వు బాగుండాలి అన్నాను. తిరుపతిరావును ఆటలో అరిటిపండులా మార్చితే ఇబ్బంది. జగన్ కు సైతం కక్షసాధింపు చర్యలు వద్దు, వైఎస్ లా పాలించండి అని పలు సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాం. లోకేశ్, చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్ నాతో అన్నారు. తిట్టనివాళ్లకు ఎమ్మెల్యే, పార్లమెంట్ సీట్లు ఇవ్వనని చెప్పారు. హుందా రాజకీయం మాత్రమే నేను చేస్తాను.. మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

Also Read: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ రాజీనామా

పెద్దిరెడ్డి ఫోన్ చేశాడు..
నేను వైసీపీని వీడాలని అనుకున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి ఫోన్ చేసి.. తొందరపడొద్దని సూచించాడు. రాజకీయాలకు స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నా.. కానీ, శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండాలని కోరారు. దీంతో రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నా. మైలవరంలో ఇంటింటికెళ్లి చెప్పండి.. మనం నమ్మిన కృష్ణప్రసాద్ మనకి అండగా నియోజకవర్గంలోనే ఉంటాడని చెప్పండి అంటూ తన అనుచరులకు, అభిమానులకు కృష్ణ ప్రసాద్ భరోసా ఇచ్చారు. చివర్లో జోహార్ వైఎస్సార్, జోహార్ ఎన్డీఆర్ అంటూ వసంత కృష్ణప్రసాద్ తన ప్రసంగాన్ని ముగించాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు