ఎన్నికల్లో పోటీపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు, సీఎం జగన్‌తో కలిశాక..

మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు.

Vasantha Venkata Krishna Prasad (Photo : Google)

Vasantha Venkata Krishna Prasad : వచ్చే ఎన్నికల్లో పోటీపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు. మైలవరం నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తున్నా అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తేల్చి చెప్పారు. ఈసారి కూడా తప్పకుండా గెలుపొందుతా అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులన్నీ వైసీపీకి సానుకూలంగా ఉన్నాయని చెప్పారాయన.

ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ పిలిచి అన్నీ వివరంగా చెప్పారని, ఆ తర్వాత రెండోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా అని వివరించారు వసంత కృష్ణ ప్రసాద్. సొంత పార్టీలోనే ఉన్న కొన్ని శక్తులు చేస్తున్న అక్రమ దందాలు, బూడిద అక్రమ తరలింపు, ఇతరత్రా అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు అని కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.

Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి, నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నా నియోజకవర్గ అభివృద్ధికి పార్లమెంట్ నిధుల విషయంలో చాలా సహకరించారని చెప్పారు. ఆయన పార్టీలో జరిగే పరిణామాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం అని తేల్చి చెప్పారు.

మాజీమంత్రి దేవినేని ఉమ నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. వాటిని అడ్డుకోవటానికి ఇప్పుటివరకు ప్రయత్నాలు చేశానని అన్నారు. కానీ రోజురోజుకీ అసత్య ప్రచారాలను ఎక్కువ చేస్తున్నారని, అందుకే దేవినేని ఉమకు లీగల్ నోటీసులు ఇచ్చానని పేర్కొన్నారు. దేవినేని ఉమ బహిరంగ క్షమాపణ చెబితే సరి, లేకపోతే చట్ట ప్రకారం ఆయనపై ప్రొసీడ్ అవుతాను అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.

Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?