C Ramachandraiah: మరో సంచలనం.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, విజయసాయి రెడ్డి బంధువులు

విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడి కోట ద్వారకానాథ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారు.

YCP MLC C Ramachandraiah, Vijayasai Reddy, TDP

ఏపీ ఎన్నికల వేళ టీడీపీలో చేరేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు పలువురు కీలక నాయకులు వచ్చారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి బంధువులు కూడా పెద్ద ఎత్తున రావడం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో వారు టీడీపీలో చేరారు.

విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడి కోట ద్వారకానాథ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి ద్వారకానాథ రెడ్డి మేనమామ అన్న విషయం తెలిసిందే.

విజయసాయి రెడ్డి బావమరిది ద్వారాకానాథ రెడ్డి మాట్లాడుతూ… విజయసాయి రెడ్డి, ఆయన భార్య మినహా మిగతా కుటుంబ సభ్యులందరూ టీడీపీలో చేరేందుకు వచ్చారని అన్నారు. భవిష్యత్తులో విజయసాయి రెడ్డి దంపతులు కూడా వైసీపీని వీడే పరిస్థితి రావొచ్చని చెప్పారు. విజయసాయి రెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానించే హక్కు తనకు ఉందని అన్నారు. వైసీపీలో తనకు టిక్కెట్ ఇస్తానని మాట తప్పారని చెప్పారు.

చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని అన్నారు. ఏమి చేసినా జగన్ చేసిన అప్పులు తీరవని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదని అన్నారు.

తనలాగే వైపీసీలో ఇంకా ఎంతో మంది ఉన్నారని, సమయానుకూలంగా వారు కూడా బయటకు వస్తారని చెప్పారు. టీడీపీలో చేరేందుకే చంద్రబాబుని కలిశానని అన్నారు. తనకు పదవుల కంటే సమాజమే ముఖ్యమని చెప్పుకొచ్చారు.

B Tech Ravi: ఎన్నికల వేళ ఏపీలో మరో కీలక పరిణామం.. బ్రదర్‌ అనిల్‌తో బీటెక్‌ రవి..