Duvvada Srinivas
Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి, కుమార్తె హైందవి, వారి బంధువులుపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఎస్ అండ్ జేఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న తన ఇంటిపై వారు దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నంకు పాల్పడ్డారని దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను దువ్వాడ కోరారు. తనపై దాడికి పాల్పడిన వాణి, హైందవి, వారి బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటివద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత.. నా కథకు డైవర్స్ తోనే స్వస్తి పలుకుతానన్న శ్రీనివాస్
కాగా, భార్యతో ఇక కలిసుండే ఉద్దేశం తనకు లేదని, ఆమెకు డివోర్స్ ఇస్తానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. తన పొలిటికల్ కెరీర్ ను ఆమె నాశనం చేసిందని, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేకుండా చేసిందని ఆరోపించారు. కన్నకూతుర్లే తనను ప్రశ్నించేలా తయారుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరువు కోసం ఇన్నాళ్లు ఓపిక పట్టానని, ఇప్పుడు తన భార్య రోడ్డెక్కడంతో తాను కూడా విసిగిపోయానని అన్నారు.