ప్రశాంత్ కిశోర్ కాదు.. అశాంతి కిశోర్: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్

ప్రశాంత్ కిశోర్ టీడీపీతో చేతులు కలిపి అశాంతి కిశోర్‌గా మారారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

gorantla madhav fires on prashant kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశాంత్ కిశోర్ టీడీపీతో చేతులు కలిపి అశాంతి కిశోర్‌గా మారారని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ కిశోర్‌ మాటలు నమ్మి బెట్టింగులు కాసేవారు నష్టపోతారని అన్నారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

”పీకే మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవు. పిల్లి శపిస్తే ఉట్లు తెగవు అనేది ప్రశాంత్ కిశోర్‌ గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో కూడా ఒక పార్టీ పెట్టి సఫలీకృతం కావాలని ఆయన ప్రయత్నం చేశాడు. శకునం పలికిన పిల్లి కుడితిలో పడినట్లు ఎక్కడా ఆయన సక్సెస్ కాలేదు. టీడీపీలో చేరి అశాంతి కిశోర్‌గా మారిపోయారు. ఆయన మాటలు నమ్మి టీడీపీలో రూపాయికి రూపాయిన్నర బెట్టింగులు కాస్తున్నారు. 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి. టీడీపీ ఓటమి ఖాయం.. వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టింగులు కడితే నష్టపోతారు.

మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడితేనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాన్ని అడ్డుకున్నారు. అక్కడ రీపోలింగ్ జరపాలని అడిగాం.. టీడీపీ కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు చంద్రబాబు తమకు ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలకు చెప్పాలి. కచ్చితంగా జూన్ 9న ఉదయం 9.30 గంటలకు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు. దేశం నిర్ఘాంత పోయే విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలు వస్తాయ”ని ఎంపీ గోరంట్ల మాధవ్ జోస్యం చెప్పారు.

Also Read: ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు