AP Politics: బీసీ ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ వ్యూహాలు.. ఏం జరుగుతుందో తెలుసా?

గత ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వైసీపీకి.. ఈ సారి టీడీపీ-జనసేన కూటమి నుంచి గట్టిసవాల్‌...

BC strategy

AP Politics: తూర్పులో అనుకూల తీర్పు రావాలని కోరుకునే పార్టీలు అనేక వ్యూహాలను రచిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇతర సామాజికవర్గ ఓట్ల కోసం పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్నాయి.

ముఖ్యంగా కాపులతో సమానంగా ఉండే శెట్టి బలిజతోపాటు ఇతర బీసీ సామాజికవర్గ ఓట్లకు గాలం వేస్తున్న పార్టీలు… ఉమ్మడి తూర్పుగోదావరిలో ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఈ వ్యూహాన్ని అమలు చేసేవిధంగా అడుగులు వేస్తుండగా, టీడీపీ-జనసేన కూటమి కూడా బీసీ జపం చేస్తున్నాయి…

ఎన్నికల తంత్రంగా..
వైసీపీది బీసీ సాధికారిక బస్సు యాత్ర… టీడీపీదీ జయహో బీసీ నినాదం.. రెండు ప్రధాన పార్టీల నినాదాలు బీసీల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీలు, కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో పార్టీలు బీసీ మంత్రమే ఎన్నికల తంత్రంగా అమలు చేస్తున్నాయి…. ముందుగా నియోజకవర్గ ఇన్‌చార్జుల పేరున అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ…. బీసీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రాధాన్యమిస్తోంది.

బీసీల్లో ఎక్కువగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నష్టం జరగకుండా ప్లాన్‌ చేస్తోంది. ఈ జిల్లాలో కాపులు ఓట్లు ఎక్కువగా ఉండగా, వాటికి కొద్దిగా అటుఇటుగా శెట్టిబలిజ ఓట్లు ఉన్నాయి. దీంతో జనసేన రూపంలో కాపుల ఓట్లు ఏమాత్రం తగ్గినా… శెట్టిబలిజ సామాజిక వర్గ ఓట్లతో విక్టరీ కొట్టాలని ప్లాన్‌ చేస్తోంది వైసీపీ..

బరిలో వీరే..
జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి నగరం, రామచంద్రపురం, ముమ్మిడివరం అసెంబ్లీ స్థానాలతోపాటు రాజమండ్రి లోక్‌సభ సీటును బీసీలకు కేటాయించింది వైసీపీ. ఇందులోనూ రాజమండ్రి రూరల్, రామచంద్రపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలకు అభ్యర్థులుగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలను ఎంపిక చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపుతోంది.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్‌ను అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ.. అలాగే రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి అనుసూరి పద్మలతకు పోటీకి పెట్టాలని భావిస్తోంది. ఈమె కూడా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళానేతే కావడం విశేషం. కాపులతో సామానంగా శెట్టిబలిజ సామాజక వర్గం ఎక్కువగా ఉండడం వల్లే వైసీపీ… ఆ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిస్తోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.

ఈ ముగ్గురు నేతలతోపాటు మరో రెండు స్థానాల నుంచి బీసీ వర్గాలకు చెందిన ఎంపీ మార్గాని భరత్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌కు టికెట్లు ఇస్తోంది వైసీపీ… ఇలా జిల్లాలో ఓ ఎంపీతోపాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీసీ నేతలను బరిలోకి దింపుతున్న వైసీపీ… నామినేటెడ్‌ పదవుల్లోనూ ఆయా వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతోంది. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్సీగా కుడిపూడి సూర్యనారయణలను చూపుతోంది.

గత ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వైసీపీకి.. ఈ సారి టీడీపీ-జనసేన కూటమి గట్టిసవాల్‌ విసురుతున్నాయి. అంతేకాకుండా గత ఎన్నికల్లో వైసీపీకి కొమ్ముకాసిన కాపు ఓటర్లు ఈ సారి జనసేనకు మళ్లే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు ఉండటంతో… పక్కా స్కెచ్‌ వేసింది వైసీపీ… శెట్టిబలిజతోపాటు బీసీ ఓటర్లను ఆకర్షిస్తే వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు ఈజీ అన్న భావనలో ఉన్నారు ఆ పార్టీ అగ్రనేతలు… దీంతో ప్రతిపక్ష కూటమిలోని టీడీపీ-జనసేన నేతలు అలర్ట్‌ అవుతున్నారు.

వైసీపీ వ్యూహానికి దీటైన వ్యూహాన్ని రచ్చిస్తున్నారు. ఐతే కూటమిలో సీట్ల పంపకంతోపాటు బీసీలకు సీట్లు కేటాయించడం వారికి తలనొప్పిగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీడీపీలో బీసీ నేతలు ఎక్కువగా ఉన్నప్పటికీ పొత్తులు కొన్ని సీట్లు జనసేనకు కేటాయించాల్సిరావడంతో ఎవరి స్థానం గల్లంతు అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

టీడీపీలో బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని ఉన్నారు. ఈ సారి ఆదిరరెడ్డి భవాని లేదా ఆమె భర్త శ్రీనివాస్‌ పోటీ చేయడం ఖాయమనుకుంటున్నారు. ఐతే కూటమిలో బీజేపీ చేరితే రాజమండ్రి సిటీ సీటు కోరే అవకాశం ఉందంటున్నారు. దీంతో భవానికి మళ్లీ చాన్స్‌ వస్తుందా? రాదా? అన్న టెన్షన్‌ మొదలైంది.

ఇక టీడీపీలో బీసీ నాయకులైన కాకినాడ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మితోపాటు రామచంద్రాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మళ్లీ పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వీరికి టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నా… ఆయా నియోజకవర్గాలు జనసేనకు కేటాయించే చాన్స్‌ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

అంతుచిక్కని ప్రశ్న ఇదే..

ఇదే జరిగితే టీడీపీ-జనసేన కూటమి బీసీలను ఎక్కడ భర్తీ చేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. ఇక తునిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యకు మాత్రమే ప్రస్తుతానికి సీటు కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమలాపురం ప్రాంతానికి చెందిన వాసంశెట్టి సుభాష్, కాదం వెంకటరమణ వంటి బీసీ నేతలు టికెట్లు ఆశిస్తున్నారు.

ఇక జనసేనలో ఎక్కువ మంది కాపు నేతలు టికెట్లు ఆశిస్తుండగా, ముమ్మడివరం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పితాని బాలకృష్ణ ఒక్కరే ఆ పార్టీలో మళ్లీ పోటీ చేసే చాన్సు ఉన్న బీసీ నేత. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల బాలకృష్ణను పోటీకి పెట్టారు. ఐతే ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండటం వల్ల మళ్లీ ముమ్మడివరం జనసేనకు కేటాయిస్తారో లేదో అన్న టెన్షన్‌ ఉంది.

ఇలా కూటమిలో బీసీ లీడర్లు టికెట్లపై స్పష్టత లేకపోవడం… వైసీపీ బీసీలకు టికెట్లు కేటాయించి ఓ అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తుండటంతో రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ… అధికార పార్టీ వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పొత్తుల్లో రెండు పార్టీలు కలిపి ఎంతమంది బీసీలకు టికెట్లు కేటాయిస్తారన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

ట్రెండింగ్ వార్తలు