‘ఇక పోరాడదాం.. గట్టిగా హెచ్చరికలు పంపాలి’.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న దారుణాలను దేశ ప్రజలకు చూపుతామని చెప్పారు.

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయని తెలిపారు. వినుకొండలో జరిగిన హత్యా ఘటన ఇందుకు పరాకాష్ఠ అని అన్నారు.

ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని చెప్పారు. 15 ఏళ్లుగా వైసీపీని చంద్రబాబు ఆశించినట్టుగా అణగదొక్కలేకపోయారని అన్నారు. రాష్ట్రపతి పాలనకు పార్లమెంటులో డిమాండ్‌ చేయాలని చెప్పారు. చంద్రబాబు నాయుడికి గట్టిగా హెచ్చరికలు పంపాలని అన్నారు. ఒకవేళ పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదని చెప్పారు.

తాము కూడా అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని అన్నారు. మంగళవారం నాటికి ఢిల్లీకి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారని తెలిపారు. బుధవారం నిరసన తెలుపుతామని వివరించారు. ఏపీలో జరుగుతున్న దారుణాలను దేశ ప్రజలకు చూపుతామని చెప్పారు. ఏపీలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని అన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలని చెప్పారు.

Also Read: దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూను లేవనెత్తుతాం: వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు