జనంలోకి జగన్.. ఎప్పుడో చెప్పిన వైసీపీ అధినేత.. ‘ఇక చంద్రబాబుకి ప్రతి రోజూ సినిమానే’ అంటూ..

YS Jagan : అమరావతిలో నిరంతరం రోడ్లు, నిరంతరం కరెంటు, నిరంతరం నీళ్లు, నిరంతరం డ్రైనేజీ కట్టే బదులు, వీటికోసం రూ.2లక్షల కోట్లు భారాన్ని రాష్ట్రంపై వేసే బదులు, అందులో 10శాతం పెడితే చాలు బ్రహ్మాండమైన రాజధాని అయ్యేది.

YS Jagan

  • అమరావతి రాజధాని పేరుతో దోచుకుంటున్నారు
  • వచ్చే సంవత్సరం నా పాదయాత్ర ఉంటుంది
  • వైసీపీ శ్రేణులు ప్రతిరోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తారు
  • వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి

YS Jagan : అమరావతి పేరుమీద అడ్డంగా దోచేస్తున్నారు.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు, అమరావతిలో రూ.14వేలకు చదరపు అడుగుకు కట్టబెడుతున్నారు. రాష్ట్రాన్ని ఇలా కొల్లగొడుతుంటే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి..? మధ్య తరగతి ప్రజలు, పేదల పరిస్థితి ఏమిటి? అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై, కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు దంచికొట్టనున్న వానలు.. పిడుగులు పడతాయ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

చంద్రబాబు ఐదేళ్లకాలంలో సగం కాలం అయిపోయింది. వచ్చే సంవత్సరం నా పాదయాత్రకూడా ఉంటుంది.. ప్రజలతో మమేకం అవుతాను.. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రతిరోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తారని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబుకు రాజధాని విషయంలో ఆచరణాత్మక పరిష్కారం చూపించాం. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారు. అమరావతి పేరు చెప్పి రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతిలో ఒక ఎకరాకు కనీస సదుపాయాలకు రూ.2 కోట్లు.. మొదటి యాభై వేల ఎకరాలకే రూ.1 లక్ష కోట్లు. దీనికే దిక్కు లేదంటే.. మరో 50వేల ఎకరాలు. అంటే 2లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అంటూ జగన్ ప్రశ్నించారు. అయ్యేసరికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది. రేపటికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? అని ప్రశ్నించారు.

రాజధానిగా బెస్ట్‌ ఆప్షన్‌గా ప్లాన్‌ -A కింద వైజాగ్‌ను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూలును చెప్పాం. అమరావతిని లెజిస్లేచర్‌ రాజధానిగా చెప్పాం. ఈ ప్రాంతంలోనే పెట్టాలనుకుంటే ప్లాన్‌ -B కింద ఇక్కడ పెట్టాం. మచిలీపట్నం – విజయవాడ- గుంటూరులను కలిపే 110 కి.మీ హైవేకు అటుఇటుగా రాజధాని గ్రోత్‌ కారిడర్‌ ప్రాంతంగా MAVIGUN పేరుతో సూచించామని జగన్ అన్నారు.

అమరావతిలో నిరంతరం రోడ్లు, నిరంతరం కరెంటు, నిరంతరం నీళ్లు, నిరంతరం డ్రైనేజీ కట్టే బదులు, వీటికోసం రూ.2లక్షల కోట్లు భారాన్ని రాష్ట్రంపై వేసే బదులు, అందులో 10శాతం పెడితే చాలు బ్రహ్మాండమైన రాజధాని అయ్యేది. దీంతోపాటు గ్రోత్‌ ఇంజిన్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పాం. కానీ, చంద్రబాబు వద్దంటున్నాడు. ఇన్నిరకాల సదుపాయాలు, సౌకర్యాలు, ప్రయోజనాలు ఉన్న MAVIGUN కాకుండా అమరావతే ఎందుకు కావాలని చంద్రబాబు పట్టుబడుతున్నాడు.? కారణం ఏంటంటే.. చంద్రబాబు దోపిడీకి, అవినీతికి అమరావతి అతిపెద్ద గని కాబట్టి అంటూ జగన్ ఆరోపించారు. అమరావతి పేరుతో కాంట్రాక్టులు వస్తాయి. వాటిపేరుమీద కమీషన్లు నిరంతరం దండుకోవచ్చన్నది ఆయన ప్లాన్‌ అని జగన్ అన్నారు.

ఆంధ్రజ్యోతి యాజమాన్యానివి దుర్మార్గమైన మాటలు. వైయస్సార్‌సీపీ నాయకుల భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఇవి తప్పని చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కళ్యాణ్‌ చెప్పకుండా సమర్థిస్తారా? అసలు మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.