Pawan Kalyan
YS Jagan Tirupati Tour: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఏపీలో రాజకీయ రగడకు దారితీసింది. ఈ విషయంపై కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉండంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ తిరుపతి పర్యటనను కూటమి నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
Also Read : తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సిట్ ఏర్పాటు.. ఎవరీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ..
తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ అన్నారు. నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులే. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలి. తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దని కూటమి శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు.
తిరుమల దర్శనానికి వెళ్తున్న జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత. ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ ఇస్తారా లేదా.. ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయాలి. అధికారులూ బాధ్యత గుర్తెరగాలి. ఈ విషయంలో వైసీపీ కోరుకొనేది గొడవలే. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసింది. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.
తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ప్రస్తుత తరుణంలోనూ వైసీపీ కుటిల పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కోరుకుంటున్న గొడవలకు మనం అవకాశం ఇవ్వొద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనల్లోఉన్న వైసీపీ వ్యవహార శైలిపట్ల పోలీసు శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.