Ys jagan
Posani Krishna Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో పోసానిని అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం లో ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో ఆయన్ను రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిసింది.
పోసాని కృష్ణ మురళి అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పోసాని అరెస్టును ఖండించారు. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో జగన్ పరామర్శించారు. పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుసుమలతకు జగన్ భరోసా ఇచ్చారు.
అంతకుముందు .. పోసాని సతీమణి కుసుమలత మాట్లాడుతూ.. రాత్రి 8గంటలకు ఇంటికి వచ్చిన పోలీసులు.. నా భర్త ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్ కు వెళ్లాలని చెప్పినా వినిపించుకోకుండా అరెస్టు చేశారని అన్నారు. నోటీసు ఇవ్వండి రేపు పోలీస్ స్టేషన్ కు వస్తామని చెప్పామని, నా భర్త ఫోన్, నా ఫోన్ కూడా తీసుకెళ్లారని కుసుమలత ఆరోపించారు. రాత్రిపూట తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. బాత్రూం, బెడ్ రూంలోకి సైతం పోలీసులు వెళ్లారు. రాజకీయాల్లో లేనని, ఇకపై ఎవరిపై మాట్లాడనని ఇప్పటికే పోసాని ప్రకటించారు. పోలీసులు హడావుడిగా బలవంతంగా తీసుకెళ్లారని కుసుమలత ఆవేదన వ్యక్తం చేశారు.