YS Jagan
YS Jagan : భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నారు. గత చంద్రబాబు హయాంలో భోగాపురం పేరుతో 10 వేల ఎకరాల పెద్ద భూదోపిడికి ప్లాన్ చేశారు. భూములు ఇవ్వమని రైతులు నిరసన తెలపడంతోపాటు 130 కేసులు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2700 ఎకరాలకు ప్రాజెక్టును కుదించి నిర్మాణం చేపట్టాం. 960 కోట్లు ఖర్చుచేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి న్యాయం చేశామని జగన్ అన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు నాయుడు కనీసం పర్మిషన్లు తీసుకురాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అనుమతులు తీసుకొచ్చాం. నేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో అనేకసార్లు మాట్లాడా.. అన్ని అనుమతులు తీసుకొచ్చా. రోడ్లు, నీళ్లు, కరెంటు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. 2023 మే3వ తేదీన శంకుస్థాపన చేసి 2026లో మొదటి ఫ్లైట్ ఎగురుతుందని చెప్పామని జగన్ అన్నారు. కానీ, భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ కొట్టేచేసేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడంటూ జగన్ విమర్శించారు.
చంద్రబాబు ఏం చేశారని భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ఇవ్వాలంటూ జగన్ ప్రశ్నించారు. భోగాపురానికి చంద్రబాబు ఏమీ చెయ్యకుండానే క్రెడిట్ కోసం నానా కష్టాలు పడుతున్నాడని జగన్ విమర్శించారు.
మా ఐదేళ్ల పాలనలో మేము చేసిన అప్పులు 3.32 లక్షల కోట్లు. ఇందులో 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చాం. చంద్రబాబు రెండేళ్లు పూర్తి కాకుండానే 3.02లక్షల కోట్లు అప్పులు చేశారు. వచ్చే మూడేళ్లలో 11లక్షల కోట్లు అప్పులు చెయ్యడానికి సిద్ధమయ్యారని జగన్ అన్నారు. ఈ అప్పులన్నీ చేసిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ఒక్క పథకం అమలు చెయ్యడం లేదు.. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు, పథకాలు అమలు చేయకపోగా.. అధిక చార్జీల విధిస్తున్నారని జగన్ ఆరోపించారు.
రెండేళ్లలో విద్యుత్ బిల్లుల్లోనే ప్రజల నుంచి అదనంగా 20వేల కోట్లు వసూళ్లు చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50శాతం పెంచేశారు. గ్రామాల్లో నీటి పన్ను వసూళ్లు చేస్తున్నారు. కొత్త వాహనాలకు రోడ్డు సెస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. అన్ని రోడ్లకు టోల్ గేట్స్ పెట్టేసి వసూళ్లు చేస్తున్నారు. అన్ని రకాల ఖనిజ వనరులను స్కాం చేస్తూ రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారని జగన్ విమర్శించారు. కింది నుంచి పైదాకా ఏ పనికైనా లంచాలు ఇవ్వాల్సిందేనని జగన్ ఆరోపించారు.