దర్శనానికి వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం దేశంలో ఇదే తొలిసారి: వైఎస్ జగన్

దేవుడి దర్శనానికి వెళ్దామనుకుంటే అడ్డుకుంటున్నారని..

Ys Jagan

దర్శనానికి వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం దేశంలో ఇదే తొలిసారి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని తెలిపారు. దేవుడి దర్శనానికి వెళ్దామనుకుంటే అడ్డుకుంటున్నారని, వైఎస్సార్సీపీ నేతలను నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారని చెప్పారు.

ఒకవైపు నన్ను వెళ్లనివ్వకుండా నోటీసులు పంపుతున్నారని, మరోవైపు ఆశ్చర్యంగా ఇతర రాష్ట్రాల నేతలకు మాత్రం అనుమతి ఇస్తున్నారని చెప్పారు. తిరుపతి లడ్డూను దగ్గరుండి అపవిత్రం చేసే ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? అని అన్నారు. అసత్యాలు చెబుతూ తమపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

మాజీ సీఎం అయినప్పటికీ తనను తిరుమలకు పోనివ్వట్లేదని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని చెప్పారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అసత్యాలకు రెక్కలు కట్టారని, ఆరు నెలలకు ఒకసారి నెయ్యి కొనుగోలు టెండర్లు జరుగుతాయని అన్నారు.

YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు