Ys Jagan : రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పోలీసుల సమక్షంలోనే సుబ్బరాయుడిని హత్య చేసి అతడి భార్యపైనా దాడి చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ నిలదీశారు. నంద్యాల జిల్లాలో జగన్ పర్యటించారు. మహానంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు జగన్.
”30, 40 మంది ఒక చోట ఏకమయ్యారు. రాడ్లు పట్టుకుని వచ్చారు. వారి చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు. గ్రామానికి వెంటనే పోలీసులను పంపించి ఉంటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్ష్యాత్తు ఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందే దారుణానికి ఒడిగట్టారు. చంద్రబాబు, లోకేశ్ అండదండలతో, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో.. పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడిని హతమార్చారు. మరికొందరిపై దాడి చేశారు. సుబ్బారాయుడి భార్యను నరికారు. ఏదో దారుణం జరగబోతోందని తెలిసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసుల సమక్షంలోనే లా అండ్ ఆర్డర్ ను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోంది. సుబ్బారాయుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది” అని జగన్ వాపోయారు.
Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?
సుబ్బారాయుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రధాన అనుచరుడు. ఆదివారం తన ఇంటి దగ్గరే అతడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ పై నిప్పులు చెరిగారు జగన్. మీటింగ్ లు పెట్టి మరీ వైసీపీ కార్యకర్తలను చంపమని చెబుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్డడం లేదని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ బతకాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ అరాచకాలన్నీ ఆగిపోవాలన్నారు జగన్. చంపిన వాళ్లపై మాత్రమే కాకుండా చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్లపైనా కేసులు పెట్టాలని, అరెస్ట్ చేసి జైల్లో వేయాలని, అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుందని జగన్ స్పష్టం చేశారు.