సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?

ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ... సొంత పార్టీలో తప్పులను ఎత్తిచూపుతున్న కేతిరెడ్డి.... రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?

Gossip Garage : చాలా మంది ట్రెండ్‌ ఫాలో అవుతారు. కొందరే ట్రెండ్‌ సెట్ చేస్తారు. అలాంటి వారిలో ఆ మాజీ ఎమ్మెల్యే ఒకరు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆయనో ట్రెండ్ సెట్టర్. ప్రతిరోజూ జనంలో తిరుగుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న ఆ నేత ఇప్పుడు సడన్‌గా రూటు మార్చేశారు. తన వేషమూ… భాష కూడా మార్చేసి… పార్టీ అధినేతపై ప్రశ్నలు సంధిస్తూ ఎన్నో సందేహాలకు తెరలేపుతున్నారు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సోషల్ మీడియాలో వైరల్..
గుడ్ మార్నింగ్ అంటే ఏపీ రాజకీయాల్లో గుర్తుకొచ్చేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. 2009లో ఒకసారి… 2019లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి… గత ఐదేళ్లలో ఓ ట్రెండ్‌ సెట్ చేశారు. రోజూ ఉదయాన్నే నియోజకవర్గంలో పర్యటించడం.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం ద్వారా రాష్ట్రంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కేతిరెడ్డి. గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమం ధర్మవరం ప్రజలకు ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ, కేతిరెడ్డికి మాత్రం పెద్దగా వర్కౌట్‌ కాలేదనే విశ్లేషణలు ఉన్నాయి. రకరకాల వీడియోల ద్వారా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన కేతిరెడ్డికి… వాస్తవ ఫలితాలు మాత్రం జీర్ణించుకోలేని విధంగా నిరాశను మిగిల్చాయి.

కేతిరెడ్డి స్వరంలో మార్పుపై చర్చ..
వైసీపీ అధినేత జగన్‌ రూపొందించిన గడప గడపకు కార్యక్రమం స్టైల్‌లోనే కేతిరెడ్డి డోర్‌ టు డోర్‌ టూర్‌ ఉండేది. ఐతే ఎమ్మెల్యేలు, ఎంపీలను జగన్‌ బలవంతంగా పంపితే.. కేతిరెడ్డి మాత్రం క్రమం తప్పకుండా తిరిగే వారు. ఆయన రోజువారీ పర్యటనలో ఏం జరిగేదో కానీ, సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారంతో ఇంకొందరు నేతలు కూడా సేమ్‌ స్టైల్‌ అనుసరించే వారు. ఈ విధంగా పొలిటికల్‌గా ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన కేతిరెడ్డి… మిగతా వైసీపీ నేతల మాదిరిగానే అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌పై తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించే వారు. ఐతే ఎన్నికల్లో కూటమి గెలుపుతో కేతిరెడ్డి స్వరంలో క్రమంగా మార్పు వస్తుండటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

స్టైలిష్‌ లుక్‌ పోయి మాసిన గడ్డంతో తీవ్ర నిర్వేదం..
తన గెలుపు పక్కా అనుకున్న కేతిరెడ్డికి దిమ్మతిరిగిపోయేలా జనం షాక్ ఇవ్వడంతో స్వరంతోపాటు వేషం, భాష కూడా మార్చేశారు కేతిరెడ్డి. ఎమ్మెల్యే హోదాలో మంచి స్టైలిష్‌ లుక్‌లో తయారయ్యే వారు కేతిరెడ్డి. ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకునే వారు. వాడే కారు దగ్గర నుంచి హెయిర్‌కట్‌, డ్రెస్సింగ్‌ అంతా సెపరేట్‌గా ఉండేది. ఆయన నడక, నడత, మాట అంతా స్పెషల్‌గా ఉండటంతో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయ్యేవారు. కానీ, ధర్మవరం ప్రజలు మాత్రం తనకు దూరమయ్యారన్న విషయాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు గుర్తించలేకపోయారు కేతిరెడ్డి. దీంతో ఆయన మాట తీరే కాదు స్వరం, స్వరూపం అన్నీ మారిపోయాయి. తీవ్ర నిర్వేదంలో మాసిన గడ్డంతో కనిపిస్తున్న కేతిరెడ్డి… సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు.

సడెన్ గా స్వరం మార్చేసిన కేతిరెడ్డి.. సొంత పార్టీపైనే విమర్శలు..
ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్లే వైసీపీ ఓడిపోయిందని.. తమ ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పిన కేతిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చేశారు. వైసీపీ హయాంలో సీఎంవో అధికారుల వ్యవహారశైలి, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వని అధినేత జగన్ వల్లే ఓడిపోయామని విమర్శలు గుప్పిస్తున్న కేతిరెడ్డి వైసీపీలో దుమారం రేపుతున్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌ను వెనకేసుకొస్తున్నట్లు… ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయంటున్నారు.

వైసీపీని ఇబ్బందుల్లో పడేసేలా విమర్శలు..
సొంత నియోజకవర్గంలో వన్ మ్యాన్ షో చేసిన కేతిరెడ్డి.. ధర్మవరంలో గెలుపు పక్కా అనుకున్నారు. కానీ, ఓటర్లు కూటమికే జైకొట్టారు. దీంతో కంగుతిన్న కేతిరెడ్డి రెండు నెలలుగా తన ఓటమిపై పోస్టుమార్టం చేసుకుంటున్నారు. తొలుత తమ ఓటమికి ఈవీఎంలే కారణమన్న కేతిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చుకుని సొంత పార్టీ నేతల తప్పులను వేలెత్తి చూపడం హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ ప్రభుత్వంలో ఇసుక, మద్యం విధానాలను తప్పుపడుతూ వీడియో రిలీజ్‌ చేసిన కేతిరెడ్డి… ప్రభుత్వం అభివృద్ధి చేయాలి కానీ, వ్యాపారం చేయకూడదని వ్యాఖ్యానించి పార్టీని ఇబ్బందుల్లో పడేశారంటున్నారు.

టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా?
ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఇవే తరహా ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కేతిరెడ్డి వ్యాఖ్యలపై అనుమానాలు రేకెత్తుతున్నాయంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల హామీలు అమలు చేయాలని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను కూడా కేతిరెడ్డి తిప్పికొడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారని… ఈ సంవత్సరాంతం వరకైనా వారికి సమయం ఇవ్వాలని సొంత పార్టీ నేతలకు సూచనలివ్వడం ద్వారా…. టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలకు తెరలేపారు కేతిరెడ్డి.

రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా?
ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ… సొంత పార్టీలో తప్పులను ఎత్తిచూపుతున్న కేతిరెడ్డి…. రాజకీయంగా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేతిరెడ్డిలో సడన్‌గా ఎందుకింత మార్పు వచ్చిందనేది ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. ఆయన ఏమైనా పార్టీ మారే ఆలోచనలా ఉన్నారా? అని సొంత పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట… కేతిరెడ్డి అంతరంగం ఏంటో గానీ, ఇటు స్వపక్షం.. అటు అధికార పక్షంలో హాట్‌ డిబేట్‌కు తెరలేపారు.

Also Read : వైసీపీని వీడి మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు నేతలు..!