కడపలో నా ఓటమికి కారణం అదే.. కాంగ్రెస్‌కు అందుకే ఓట్లు వేయలేదు: వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

ys sharmila interesting comments on ys jagan defeat in AP election

YS Sharmila: ఏపీలో ఈసారి ఎన్నికలు విచిత్రంగా జరిగాయని, ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని మార్పు కోసం వైసీపీని ఓడించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ”ఫర్ జగన్, అగెనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు జరిగాయి. మార్పు కావాలనే ఏపీలో వైసీపీని ఓడించారు. అనుకున్న మేరకు ఏపీలో కాంగ్రెస్ ప‌ర్ఫామ్‌ చేయలేకపోయింది. సర్వేలో కాంగ్రెస్‌కు 7 శాతం ఓటింగ్ వచ్చింది. ప్రజలు వారి ఓటు వేస్ట్ అవకూడదని, ఓటు చీలకూడదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుంద”ని అన్నారు.

కడపలో అందుకే ఓడిపోయా
ఎన్నికల ప్రచారానికి తగినంత సమయం లేకపోవడం వల్లే కడపలో తాను ఓడిపోయానని వైఎస్ షర్మిల అన్నారు. ”కడప ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కడప ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కడపలో విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టారు. నా ఓటమికి కారణం సమయం లేకపోవడమే. 14 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం చేశాను.వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుందని కడపలో చాలా మందికి తెలియదు. హంతకులు చట్ట సభలకు పోకుండా అడ్డుకోవాలని నేను కడప నుంచి పోటీచేశాను. జగన్ మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పారు. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం దారుణమ”ని షర్మిల అన్నారు.

Also Read: డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసంతకం ఏ ఫైలుపై చేశారో తెలుసా?

హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని షర్మిల సూచించారు. ”ఏపీ ప్రజలను మోదీ మోసం చేశారు.  పదేళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ మాట నిలుపుకోలేదు. చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేది కాదు. చంద్రబాబు ఇచ్చిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉంది. చంద్రబాబు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కల అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి. 2018కి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాట నిలుపుకోలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ కాలయాపన చేసింది. పోలవరం ప్రాజక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో ప్రాజెక్టుల స్థితిగతులపై బ్లూ ప్రింట్ ఇవ్వాలి. సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాల”ని షర్మిల డిమాండ్ చేశారు.

Also Read: వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే..
వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశముందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. ఏదో ఒక రోజు పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని షర్మిల సమాధానం ఇచ్చారు. ఈవీఎంపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మేధావులు అందరూ కూర్చుని చర్చించాలన్నారు.