ys sharmila
YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కొత్త అర్థం చెప్పారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యకర్తలతో శనివారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. వైసీపీ, టీడీపీ.. బీజేపీ తొత్తులుగా మారాయని ఆరోపించారు. ఒక్క ఎంపీ సీటు కూడా ఏపీలో లేకపోయినా రాష్ట్ర బీజేపీ పెత్తనం చెలాయిస్తోందన్నారు. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు, జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.
”మతతత్వ పార్టీ కాబట్టే వైఎస్సార్ బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు.. జగనన్న మాత్రం బీజేపీకి తొత్తుగా మారారు. ఏపీలో బీజేపీ అంటే.. B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్. ఈ మూడు పార్టీల్లో ఎవరికీ ఓటు వేసిన బీజేపీకి వేసినట్లే. ఆ మాత్రం సంబరానికి ఆ పార్టీలకు ఓటు వేయటం ఎందుకు? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు నేను రెడీ, మీరు రెడీనా? ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాల”ని షర్మిల అన్నారు.
Also Read: మంత్రి అంబటి రాంబాబు డాన్స్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు
వైఎస్సార్ పాలనకు జగనన్న పాలనకు నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అన్న జగనన్న మాటలు ఏమయ్యాయి? 30 వేల టీచర్ ఉద్యోగాలు ఏమయ్యాయి? ఏపీలో గ్రూప్ప్ ఉద్యోగాలకు ఎవరూ అర్హులు కారా? పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా జగనన్న ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నలు సంధించారు. ”మాట ఇస్తే మాట తప్పని.. మడమ తిప్పని నేత వైఎస్సార్. వైఎస్సార్ ఉంటే గంగవరం పోర్టు 30 ఏళ్లకు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. గంగవరం పోర్టు అమ్మగా వచ్చిన 600 కోట్ల రూపాయలతో మిగతా పోర్టులు అభివృద్ధి చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా చెబుతున్నార”ని షర్మిల ధ్వజమెత్తారు.
Also Read: నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?