ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా? అంటూ జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్‌.. కంటతడి

జగన్‌ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు.

ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా? అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్‌ చేశారు. ఇవాళ ఆమె అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. “ఆస్తులు నావైతే నేను కూడా జైలుకి వెళ్లాలని సుబ్బారెడ్డి అన్నారు. ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా?” అని షర్మిల ప్రశ్నించారు.

అసలు గిఫ్ట్ ఇస్తానంటూ ఎవరైనా ఎంవోయూ రాసుకుంటారా అని నిలదీశారు. జగన్‌ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని చెప్పారు.

రేపు విజయసాయిరెడ్డి కూడా సుబ్బారెడ్డిలాగే మాట్లాడతారని అన్నారు. నేను చెబుతున్నవన్నీ సత్యాలేనని తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతానని తెలిపారు. సుబ్బారెడ్డి కూడా ఆయన చెప్పిన విషయాలు నిజమేనని ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. అందరికీ సమాన వాటా ఉండాలని వైఎస్సార్ అనుకున్నారని తెలిపారు.

సుబ్బారెడ్డి, సాయిరెడ్డి గురించి అమ్మకు తెలియాలనే తాను వారి పేర్లను ప్రస్తావించానని షర్మిల చెప్పారు. సుబ్బారెడ్డి సాయిరెడ్డిలో కాస్తయినా నిజాయితీ ఉందేమోనని తాను అనుకున్నానని, కొంచం కూడా లేదని అన్నారు. సొంత కొడుకే కేసు వేయడంతో విజయమ్మ కుమిలిపోతున్నారని చెప్పారు. కన్నతల్లిపై కేసులు వేసే దౌర్భాగ్యులు ఉన్నారా అని అన్నారు. ఇవి చూసేందుకే బతికి ఉన్నానా అంటూ విజయమ్మ కుమిలిపోతున్నారని చెప్పారు.