guduru mla Varaprasad Rao Velagapalli: నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సామాజికవర్గం అండదండలు కానీ.. స్థానికంగా బలమైన ఎస్సీ నాయకుల అండదండలు గానీ లేకపోతే ఇక్కడ గెలుపు కష్టమే. 2014 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పనిచేసిన వరప్రసాదరావు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగి నిలదీసేవారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే తీరును ప్రశ్నించేవారు ఎక్కువైపోతున్నారట.
కొంతకాలంగా ఎమ్మెల్యేపై అసంతృప్తితో రగిలిపోతున్నారు:
గూడూరు నియోజకవర్గంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డిలతోపాటు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మేరిగ మురళి బలమైన నాయకులుగా ఉన్నారు. అలాగే ఎన్నికల ముందు పార్టీలో చేరిన గూడూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ దేవసేనమ్మ దంపతులు కూడా గూడూరులో పట్టున్న నాయకులే. వైసీపీ గెలుపు కోసం వీరంతా కష్టపడిన వాళ్లే. అయితే వీరంతా గత కొంతకాలంగా ఎమ్మెల్యేపై అసంతృప్తితో రగిలిపోతున్నారని టాక్.
వరప్రసాద్ తమకు ఏ విషయంలోనూ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన:
వరప్రసాద్ తమకు ఏ విషయంలోనూ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వీరి వాదన. తనకు అన్నీ తెలుసు.. తనకెవరూ ఏమీ చెప్పనవసరం లేదంటూ అటు పార్టీ కార్యక్రమాలనూ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలనూ తన కనుసన్నల్లోనే సాగిస్తున్నారని నేతలంతా రగలిపోతున్నారు. ఆయన ఒక మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని, పార్టీలో ఎమ్మెల్యేకు, ఆయన కుమారుడికి తప్ప మరే నాయకుడికీ ప్రాధాన్యం లేదంటూ నాయకులంతా అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తరచూ ఎమ్మెల్యేకు అసంతృప్తి వర్గానికి మధ్య విభేదాలు బయటపడుతున్నాయి.
అన్ని పోస్టులు ఎమ్మెల్యే, ఆయన కుమారుడు కనుసన్నల్లోనే భర్తీ:
నిజానికి ఈ అసంతృప్తి ఇప్పటిది కాదనే నాయకులు కూడా ఉన్నారు. వరప్రసాదరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ తెచ్చుకున్నప్పుడే మొదలైందట. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు అసంతృప్తిని పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం నాయకులంతా కృషి చేశారు. దీన్ని పక్కన పెడితే కొంతకాలం క్రితం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ, వాలంటీర్ల నియామకం, ప్రభుత్వ వైన్ షాపులో ఉద్యోగాలు, సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ జరిగాయి. ఈ పోస్టుల భర్తీ మొత్తం ఎమ్మెల్యే, ఆయన కుమారుడు కనుసన్నల్లోనే జరిగాయని టాక్.
తమకు సంబంధించిన వారికి ఒక్క పోస్టు కూడా ఇప్పించుకోలేకపోయామని బాధ:
నియోజకవర్గంలోని నాయకులెవ్వరు కూడా తమకు సంబంధించిన వారికి ఒక్క పోస్టు కూడా ఇప్పించుకోలేకపోయారని తెగ బాధ పడిపోతున్నారు. అంతే నియామకాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అప్పటి నుంచీ ఎమ్మెల్యే వరప్రసాదరావు వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మరోసారి చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల పోస్టుల భర్తీ కూడా ఎమ్మెల్యేకు, ఇతర నాయకుల మధ్య వివాదాన్ని రాజేసిందని అంటున్నారు.
https://10tv.in/enemies-increasing-for-mla-roja-in-own-party/
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదు:
నియోజకవర్గంలోని నాయకుల మధ్య తరచూ వర్గ విభేదాలు తెర మీదకు వస్తున్న క్రమంలో మరోసారి వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే వరప్రసాదరావు తీరుపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గంలోని కేడర్.. ఎమ్మెల్యేపై తిరుగు బావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే వర్గం, అసంతృప్తి వర్గం మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న మరికొందరు స్థానిక నాయకులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ పంచాయితీ మరోసారి అధిష్టానం దగ్గరకు చేరిందట. అధిష్టానం ఎలా సర్దిచెబుతుందో చూడాలంటున్నారు. పార్టీలో విభేదాలు ఇలానే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీకి భంగపాటు తప్పదని గుసగులాడుకుంటున్నారు.
https://www.youtube.com/watch?v=3jlBQkt2_K4