YS Jagan: రాష్ట్రంలో రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైసీపీ అధినేత జగన్ వాపోయారు. 25 జిల్లాలపై మొంథా తుఫాన్ ప్రభావం పడిందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఇందులో అత్యధికంగా వరి పంటకు (11 లక్షల ఎకరాలు) నష్టం వాటిల్లిందన్నారు. చంద్రబాబు 18 నెలల పాలనలో 16 సార్లు భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చాయన్నారు జగన్.
రైతులు ఇబ్బందులు పడ్డా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఒక్కరికైనా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్స్యూరెన్స్ డబ్బులూ ఇవ్వలేదు అని జగన్ ఆరోపించారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు 40 వేలు ఇవ్వాలి ఉండగా.. 5వేలు మాత్రమే ఇచ్చారని జగన్ అన్నారు.
”కనీసం రైతులకు యూరియా ఇవ్వలేకపోయారు.. బ్లాక్ లో అమ్ముతున్నారు. రైతులు అనేక కష్టాలు పడి పంట పండిస్తుంటే కనీసం గిట్టుబాటు ధర లేదు. మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
రైతులను చేయిపట్టి నడిపించే ఆర్బీకే అందుబాటులో ఉండేది. రైతులకు ఇబ్బంది రాగానే ఆర్బీకే వేగంగా స్పందించేది. ఈరోజు అలాంటి ఆర్బీకేని పూర్తిగా లేకుండా చేసేశారు. సీఎం యాప్ ద్వారా నేరుగా పర్యవేక్షణ చేసేవాళ్లం. 85లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చాం. ప్రస్తుతం 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఇస్తున్నారు.
తుఫాన్ పంట నష్టం అంచనా వెయ్యడానికి ఒక్క అధికారి కూడా ఇంతవరకు పొలాల్లోకి రాలేదు. ఒక్కరోజులో పంటలు అంచనా వెయ్యాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ ఇవ్వడం దారుణం కాదా? పొలంలోకి అడుగు పెట్టకుండా పంటల అంచనా ఎలా వేస్తారు..? పొలంలోకి వచ్చి చూస్తేనే కదా ఎంత నష్టం జరిగిందో తెలిసేది. రైతుల విషయంలో ఏ ప్రభుత్వానికైనా మానవత్వం ఉండాలి. పంట నష్టం ఇస్తే తరువాత పంట కొనుగోలు చెయ్యము అని కండీషన్స్ పెడుతున్నారు. రైతులను ఇలా బెదిరిస్తూ ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వం ఇదే చూస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసింది.
సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో ఒక రౌండ్ వేసి లండన్ వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా నుండి లోకేశ్ వచ్చి ఒకరోజు యాక్టింగ్ చేసి ముంబై క్రికెట్ చూడ్డానికి వెళ్ళిపోయారు. మా పాలనలో అధికారులకు బాధ్యత ఉండేది. వారం తర్వాత సీఎం వస్తాడు ప్రజలను అడుగుతారని తెలిసి తప్పులు లేకుండా పనిచేసే వారు. అసలిప్పుడు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుంది. చంద్రబాబు ఎందుకు పంట నష్టం లెక్కలు తక్కువ చేసి చెబుతున్నారు? ఇప్పటినుండైనా ఉచిత పంటల బీమా అమలు చెయ్యాలి. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు కన్నీళ్లు పెడితే ప్రభుత్వానికి మంచిది కాదు. రాష్ట్రానికి రైతు వెన్నుముక అని చంద్రబాబు గుర్తించాలి. వ్యవసాయం దండగ అనే ఆలోచనలో చంద్రబాబు ఉంటారు. అది సరికాదు” అని జగన్ అన్నారు.
Also Read: వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. పలువురికి గాయాలు