YSRCP : టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!

కాపులను జనసేన, టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి?

ఎన్నికల వ్యూహాలకు వైసీపీ పదును పెట్టిందా? గత ఎన్నికల్లో మాదిరిగానే కాపు ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తోందా? కాపులంతా పవన్ కల్యాణ్ ని కాదని వైసీపీకి ఓట్లు వేయాలంటే పొలిటికల్ గేమ్ తప్పదని భావిస్తోంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాపులను జనసేన, టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి? అందుకోసం ఎలాంటి ప్రణాళికలు రచించింది?

2019 ఎన్నికల్లో టీడీపీపై విసిగిపోయిన కాపులు జనసేనకు కాకుండా వైసీపీకి ఓట్లు వేశారు. కాపులు అత్యధికంగా ఉన్న స్థానాల్లోనూ వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో పవన్ పోటీలో ఉన్నా ముద్రగడ ఎపిసోడ్ కారణంగా కాపులంతా టీడీపీపై కోపం పెంచుకున్నారు. దాంతో గంపగుత్తగా వారి ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఈసారి ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయ్యేలా పక్కా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ.

Also Read : అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం.. ఏపీలో కూడా అదే చూస్తాం: చంద్రబాబు

ఈసారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు పొత్తులు కుదరడంతో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఏపీలో అత్యధిక జనాభా కలిగిన కాపుల ఓట్లపైనే ఈ పార్టీలు ఆశ పెట్టుకున్నాయి. పవన్ కల్యాణ్ తమతో ఉంటే కాపుల ఓట్లు వస్తాయని భావిస్తున్న టీడీపీ అలాంటి చోట్ల పవన్ ఇమేజ్ ను వాడుకోవాలని భావిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన డిపాజిట్లు కోల్పోయింది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా తెలంగాణలో మాత్రం పసుపు పార్టీ జనసేనకు మద్దతివ్వలేదు. ఈ అంశమే ఇప్పుడు జనసేనలో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది వైసీపీ.

తెలంగాణలో జనసేనకు మద్దతివ్వని టీడీపీకి.. కమ్మ సామాజిక వర్గం ఏపీలో ఎందుకు సహకరించాలి? అన్న చర్చను తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు తెలంగాణ ఫలితాలు వచ్చిన రోజే జనసేనను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు డిపాజిట్లు కూడా దక్కని పార్టీ అంటూ ట్వీట్లు చేశారు.

Also Read : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

అయితే, పవన్ కల్యాణ్ మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ సభలో కనీసం ఆ ప్రస్తావన కూడా చేయని జనసేనాని ఏపీలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వంలో కీలకంగా ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాదు తాను టీడీపీ వెనుక వెళ్లడం లేదని ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నానని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న పవన్.. పొత్తులను వ్యతిరేకించే వారిని వైసీపీ కోవర్టులుగా చూస్తానంటూ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు.

పొత్తుల విషయంలో ఎలాంటి తేడా ఉండదంటూ పవన్ క్లారిటీ ఇచ్చినా.. వైసీపీ మాత్రం తన స్టాండ్ ను కొనసాగిస్తోంది. తెలంగాణలో మద్దతివ్వని టీడీపీకి ఏపీలో ఓట్లు ఎలా వేస్తారు? అని కాపులను ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఎన్నికల నాటికి కాపు సామాజికవర్గం ఎవరివైపు నిలుస్తోంది చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు