YSRCP Leader Ramakrishna Reddy : వైసీపీ నేత రామకృష్ణా రెడ్డి దారుణ హత్య.. సొంత పార్టీ నేతల పనేనా? కారణం అదేనా?

సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. శనివారం రాత్రి దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. రామకృష్ణా రెడ్డిని సొంత పార్టీ నేతలు చంపారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు.. ఆయనను ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

YSRCP Leader Ramakrishna Reddy : సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. శనివారం రాత్రి దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. రామకృష్ణా రెడ్డిని సొంత పార్టీ నేతలు చంపారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు.. ఆయనను ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

చౌళూరులో వైసీపీ నేత రామకృష్ణా రెడ్డి దారుణ హత్యతో హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలు హత్య చేశారని పార్టీ నేతలు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్ హత్యకు కారణమని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. హిందూపురం రూరల్ సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ కరీముల్లా పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చాలంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో టెన్షన్ కు దారితీసింది. కేసు పెట్టేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలతో దఫదఫాలుగా చర్చలు జరిపారు.

రామకృష్ణా రెడ్డి హత్య కేసులో దర్యాఫ్తు చేస్తున్నామని.. ఎవరి ప్రమేయం ఉన్నట్టు తేలినా వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైసీపీ సమన్వయకర్త ప్రాణాలకే రక్షణ లేకపోతే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు పార్టీ కార్యకర్తలు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రామకృష్ణా రెడ్డి సొంత గ్రామం చౌళూరు. తమ గ్రామానికి సమీపంలో కర్నాటక బోర్డర్ లో దాబా నిర్వహిస్తున్నారు. గత రాత్రి దాబా మూసివేసి కారులో ఇంటికి వచ్చారు. కారు నుంచి కిందకు దిగుతుండగా.. దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఆయన కళ్లలో కారం చల్లి, వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణా రెడ్డిని స్థానికులు కారులో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు నిర్ధారించారు.

ఇద్దరు వాహనాలపై కూర్చుని ఉండగా.. మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హత్య చేసి వారంతా పరార్ అయ్యారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్, హిందూపురం రూరల్ సీఐలే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని రామకృష్ణా రెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపించారు. ఎమ్మెల్సీ పీఏ పై రామకృష్ణా రెడ్డి ఇటీవల పలు ఆరోపణలు చేయడం, రూరల్ సీఐ జీటీ నాయుడుపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం వివాదంగా మారింది. ఆగస్టు 15న గ్రామంలో జెండా ఎగరేసే విషయంలో ఎమ్మెల్సీ వర్గీయులకు, రామకృష్ణా రెడ్డికి వివాదం జరగడంతో.. చంపుతామని కొందరు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రామకృష్ణా రెడ్డి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణతో పాటు రవి, వరుణ్, నాగన్నపై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ అయ్యింది. ఇక్బాల్ ఐపీఎస్ ఆఫీసర్ గా పని చేసి ఉండటంతో కేసు దర్యాఫ్తును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అనుమానాలను బాధిత కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రామకృష్ణా రెడ్డి హత్యపై ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పందించారు. రామకృష్ణా రెడ్డిని ఎవరు హత్య చేశారన్న నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. దోషులను ఎవరినీ వదలొద్దని తాను పోలీసులకు చెప్పానని ఇక్బాల్ అన్నారు.