కొడాలి, వల్లభనేనిని వెంటాడుతున్న కర్మఫలం.. ఏం జరుగుతోందో తెలుసా?

ఎన్నికల ఫలితాల తర్వాత వారం పది రోజులు గుడివాడలోనే గడిపిన మాజీ మంత్రి కొడాలి నాని... ఆ తర్వాత..

కర్మ రిటర్న్స్‌ ….. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉందీ పదం… ముఖ్యంగా ఆ ఇద్దరు వైసీపీ నేతలను కర్మ వెంటాడుతోందంటున్నారు… చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు ఆ ఇద్దరూ గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు వల్ల.. ఇప్పుడు ఊరు, వాడ వదలి తిరగాల్సివస్తోందంటున్నారు. సరిగ్గా 60 రోజుల క్రితం వరకు హీరోల్లా రొమ్ము విరిచిన నేతలు… తొడకొట్టి సవాల్‌ చేసిన నాయకులు… ఇప్పుడు పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌… తమ ఆచూకీ తెలియకుండా… తాము ఎక్కడ ఉన్నదీ ఎవరికీ చెప్పకుండా గడుపుతున్నారు….. ఆ ఇద్దరి తీరుతో కర్మ ఫలం ఇదేనేమో అంటున్నారు అంతా… ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఏంటీ స్టోరీ…

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రభుత్వం వెంటాడుతోందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత ఈ ఇద్దరూ అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోవడంతో… వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి..
ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని అయితే, మరొకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గతంలో టీడీపీలో పనిచేసిన ఈ ఇద్దరూ వేర్వేరుగా వైసీపీలోకి వెళ్లినా… ఆ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి టార్గెట్‌ అయ్యారు. అదే సమయంలో పలు కేసుల్లో వారి ప్రమేయం ఉందని బయటపడటంతో పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత వారం పది రోజులు గుడివాడలోనే గడిపిన మాజీ మంత్రి కొడాలి నాని… ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వలంటీర్లు, బెవరేజస్‌ కార్పొరేషన్ గిడ్డంగి విషయంలో తమను బెదిరించారని గొడౌన్‌ యజమానులు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి తనను వేధించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వంశీ కోసం గాలిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వానికి టార్గెట్‌గా మారిన ఈ ఇద్దరు నేతలపై కార్యకర్త నుంచి అధినేత వరకు ఒకటే కోపం ఉందంటున్నారు. ఆ ఇద్దరూ గత ప్రభుత్వంలో అనుసరించిన తీరుతో… వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని అధిష్టానంపై ఒత్తిడి రోజురోజుకు ఎక్కువవుతోందంటున్నారు. ఇందుకు తగ్గట్టే వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయంటున్నారు. ఐతే ఈ కేసుల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్‌ మంజూరైనా… కొడాలి, వంశీ బయటకు రాకుండా అండర్‌ గ్రౌండ్‌లో ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వారిద్దరిపై ప్రస్తుతం నమోదైన కేసుల్లో అంతగా ఇబ్బంది పడేవి కాకపోయినా, కార్యకర్తలు ఆగ్రహంగా ఉండటం వల్ల దాడుల భయంతో దాక్కున్నారనే టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ 4న ఫలితాలు విడుదలైన తర్వాత కొడాలి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడిచేయగా, గన్నవరంలో వంశీ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు తమపై తీవ్ర అసహనంతో ఉన్నందున కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండటమే బెటర్‌ అనే ఆలోచనతో కొడాలి, వంశీ బయటకు రావడం లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు?
మరోవైపు కొడాలి నాని, వల్లభనేని వంశీపై నమోదైన కేసుల్లో తీవ్రత లేకపోయినా, ఆ ఇద్దరూ బయటకు వస్తే నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని క్రిమినల్‌ కేసుల్లో ఆ ఇద్దరిపై ఫిర్యాదులు పోలీసులకు అందినట్లు చెబుతున్నారు. కొందరు టీడీపీ నేతలు… ఆ కేసులను పర్యవేక్షిస్తున్నారని… కేసుల విషయం ముందుగా లీక్‌ చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున అత్యంత గోప్యత పాటిస్తున్నారని చెబుతున్నారు.

తమ చేష్టలతో ఐదేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలను వేధించిన కొడాలి, వంశీ.. ఆర్థిక మూలాలను ఇప్పటికే ప్రభుత్వం దెబ్బతీసిందని చెబుతున్నారు. అయితే ఈ విషయాలను ఆ ఇద్దరూ బయటకు చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. మరోవైపు వంశీ అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్న పోలీసులు… ఆయనకు రాజకీయంగా ఉన్న లింకులన్నీ తెంపేస్తున్నారు. దీంతో వంశీకి గడ్డి పరిస్థితులు తప్పకపోవచ్చనని అంటున్నారు.

ఇలా ఈ ఇద్దరినీ ప్రభుత్వం వెంటాడి వేటాడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ… గతంలో వారిద్దరూ అనుసరించిన తీరే ఇప్పుడీ కష్టాలను తెచ్చిపెట్టిందని… కర్మ ఫలం అనుభవించక తప్పదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై పరుష పదజాలంతో విమర్శలు దాడి చేయడమే కాకుండా… 2020లో మంత్రి లోకేశ్‌ పదో తరగతి విద్యార్థులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించగా, కొడాలి నాని, వంశీ ఆన్‌లైన్‌లో అక్రమంగా చొరబడి… మంత్రి లోకేశ్‌ను ఇబ్బంది పెట్టారని.. అప్పట్లో ఆయన ఆన్‌లైన్‌ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోవాల్సివచ్చిందని గుర్తు చేస్తున్నారు.

అప్పట్లో అంతగా రెచ్చగొట్టిన ఈ ఇద్దరి పేర్లు మంత్రి లోకేశ్‌ రెడ్‌బుక్‌లో ఒకే పేజీలో ఉన్నాయని… అప్పటి కర్మ ఇప్పుడు వీరిని వెంటాడుతోందని… లోకేశ్‌ అర్థాంతరంగా సమావేశం ముగిస్తే.. ఈ ఇద్దరూ ఇప్పుడు అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోవడం నాటి కర్మఫలితమేనని విశ్లేషిస్తున్నారు.

అంతేకాకుండా గన్నవరంలో ఓడిన వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండగా, చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరిన కొడాలి నాని… తన మాటపై నిలబడతారా? అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మొత్తానికి కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని… వల్లభనేని వంశీని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేకపోవడంతో వారు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, పర్యాటకులు

ట్రెండింగ్ వార్తలు