వైసీపీ ఎమ్మెల్యేకి రెండోసారి కరోనా, ఏపీలో ఇదే తొలి కేసు

  • Publish Date - October 8, 2020 / 01:12 PM IST

mla bhumana karunakar reddy: వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రీఇన్ ఫెక్షన్ తో భూమన కరుణాకర్ రెడ్డి బాధపడుతున్నారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ఎమ్మెల్యే భూమన చికిత్సపొందుతున్నారు.

కరోనావైరస్ ఏపీలోని ప్రజా ప్రతినిధులను వెంటాడుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. కాగా, రాష్ట్రంలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకడం ఇదే తొలి కేసు కావడం గమనార్హం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగస్టు నెల చివర్లో తొలిసారి కరోనా బారిన పడ్డారు. చికిత్స తర్వాత కోలుకోన్నారు.

ఇంతలోనే రెండోసారి కరోనా పాజిటివ్ తేలింది. కొద్దిరోజుల కిందట ఆయన కుమారుడికి కూడా కరోనా వైరస్ సోకింది. మరోసారి కోవిడ్ బారిన పడటంతో భూమన ఆరోగ్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో మరోసారి భూమనకు కరోనా సోకిందని తెలుస్తోంది.

కోలుకున్న నెల రోజులకే రెండోసారి కరోనా:
ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు అభినయ్ రెడ్డికి కూడా రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆగస్టు 25న తొలిసారి భూమనకు కరోనా సోకింది. ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నారు. సెప్టెంబర్ 3న డిశ్చార్జి అయ్యారు. కాగా, కరోనా నుంచి కోలుకున్న నెల రోజులకే మళ్లీ కరోనా అటాక్ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ(అక్టోబర్ 8,2020) కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయ్యింది. ప్రస్తుతం తండ్రీ కొడుకులకు రుయా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎమ్మెల్యే భూమన మాములుగా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల మరోసారి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో తిరుపతి ల్యాబ్‌లో పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టులో రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

కొన్ని రోజులుగా ఆయనతో నేరుగా టచ్‌లో ఉన్న వారు కోవిడ్19 టెస్టులు చేయించుకోవాలంటున్నారు. కరోనాని ఖతం చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యక్తిగత పరిశుభత్ర పాటించాలి. అలా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.

కరోనా వైరస్ రెండోసారి కూడా సోకుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండోసారి వచ్చే చాన్స్ తక్కువ. అంతేకాదు ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అయితాయి. ఈ కారణంగా మూడు నెలల వరకు మళ్లీ రాదని నిపుణులు చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న నెల రోజులకే మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ కూడా రూపాంతరం చెందడంతో దానిని శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.