ఎమ్మెల్సీ రేసులో వైసీపీ అభ్యర్థులు ఫిక్స్.. అయినా నేతల్లో పోటీలు

అధికార వైసీపీలో ఎమ్మెల్సీ రేస్‌ మొదలైంది. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు అప్పుడే లాబీయింగ్‌ మొదలుపెట్టారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో వాటిని దక్కించుకునేందుకు నేతలు పోటీపడుతున్నారు.

త్వరలో ఏపీలో విడుదలకానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ రెడీ అయింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న రత్నబాయి, కంతేటి సత్యనారాయణ పదవీకాలం గత నెలలోనే ముగిసింది. వీటితోపాటుగా.. మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. దీంతో అధికార పార్టీలో ఎమ్మెల్సీ రేస్‌ మొదలైంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపై చాలా మంది నేతలే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు టికెట్‌ త్యాగాలు చేసిన వాళ్లు… పార్టీకి ముందు నుంచి సేవలు అందించిన వారు ఇలా చాలా మందికి.. ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. జగన్‌ నుంచి హామీ పొందిన నేతలు చాలా మందే ఉన్నారు. దీంతో వారంతా తమకే టికెట్‌ దక్కుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా ఎవరి లెక్కలు వారి వేసుకుంటూ.. ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ నాలుగు స్థానాల కోసం పార్టీలో ఆశావహులు భారీగానే ఉన్నారు. సీఎం జగన్‌ మాత్రం ఇప్పటికే ఆ నలుగురు ఎవరన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు చూసుకునిని టికెట్‌ ఇచ్చే అవకాశముంది. ఇందులో కడప జిల్లాకు చెందిన ఓ మైనార్టీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

మరో స్థానం ఎస్సీ నేతలకు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఇక మిగిలిన రెండు స్థానాలను బీసీలతో భర్తీ చేసే అవకాశముందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. నేతలు ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నోటిఫికేషన్‌ రాగానే పేర్లను ఖరారు చేసే అవకాశముంది.

Read:ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు