వైసీపీని వీడుతున్న వారిలో వీరే ఎక్కువ.. తోట త్రిమూర్తులు కూడా రెడీ!

వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట.

ఐదుగురు ఎమ్మెల్సీలు ఔట్.. ఇది ఇక్కడితో ఆగదు జంపింగ్ కంటిన్యూస్ అనే చర్చ జరుగుతుండగానే.. ఆరవ ఎమ్మెల్సీ కూడా అలాంటి జంపింగ్‌కే ప్రిపేర్ అవుతున్నారనే గుసగుస వినిపిస్తోంది. వైసీపీ నుంచి మరో కీలక నేత కూటమికి దగ్గరవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు సైకిల్ పార్టీలో చక్రం తిప్పి.. ఆ తర్వాత ఫ్యాన్‌ కిందకు చేరి.. ఇప్పుడు గ్లాస్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత.. వైసీపీకి ఎప్పుడు హ్యాండ్ ఇవ్వబోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. రోజుకో నేత.. ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. వైసీపీని వీడుతున్న వారిలో ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు ఫ్యాన్‌కు హ్యాండ్ ఇచ్చారు. లేటెస్ట్‌గా జగన్‌ సన్నిహితుడిగా పేరు ఉన్న.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

తనకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్‌ నిలబెట్టుకోలేదని.. అందుకే జంప్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారనే ప్రచారం ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన తోట త్రిమూర్తులు.. వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారనే టాక్‌ వినిపిస్తోంది.

గతంలో టీడీపీలో కొనసాగిన తోట త్రిమూర్తులు.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారారు.. 1994లో తొలిసారి రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అన్ని పార్టీల్లోనూ చేరి రికార్డు సృష్టించారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ… ఇలా అన్ని పార్టీలోనూ పనిచేసిన అనుభవం సంపాదించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే.. జగన్‌ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

ఈ రెండు కోరికలు తీరడం లేదు!
అయితే ఇన్ని పార్టీలు మారినా.. ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. మంత్రి కావాలని చాలా రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. ఎమ్మెల్యేను చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు కోరికలు తీరడం లేదు. దీంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్‌ అయినట్టు ప్రచారం సాగుతోంది.

గతంలో టీడీపీలో కొనసాగిన త్రిమూర్తులు.. ఇప్పుడు తన అదృష్టాన్ని జనసేన పార్టీలో చేరి పరీక్షించుకోవాలని భావిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అసెంబ్లీలో పవన్‌ను కలిసి తన మనసులో మాట చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల టైమ్‌లో పవన్‌కల్యాణ్‌తో కలిసి ఫోటో దిగడంతో.. తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమైందని టాక్ ఊపందుకుంది.
జనసేనలోకే వెళ్లాలనుకోవడం వెనక భారీ వ్యూహమే ఉందట.

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జనసేన బలోపేతం అవుతోంది. కాపు సామాజికవర్గం మొత్తం పవన్‌ వెంటే నడుస్తున్నారు. దీంతో తన సామాజికవర్గం ఆలోచనకు తగ్గట్టుగా జనసేనలో చేరి.. మరోసారి వారి మద్దతు కూడగట్టుకోవాలని తోట త్రిమూర్తులు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యారని టాక్.

వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న త్రిమూర్తులు.. ఈ మధ్య యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ పదవి కాలాన్ని కంటిన్యూ చేయాలని కోరారు. ఇది ఫ్యాన్ పార్టీలో కలకలం రేపింది. ఆయన పార్టీ జంప్ కావడం దాదాపు ఖాయం అనే అభిప్రాయానికి వచ్చేలా చేసింది. తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవీకాలం.. మరో రెండున్నరేళ్లు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి గుడ్‌ బై చెబితే.. తిరిగి తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జనసేన అధినేతను ఆయన కోరారట.

వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ రెండు హామీలు ఇస్తే.. వెంటనే జనసేనలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారట. ఐతే ఈ విషయంలో పవన్‌ ఎటూ తేల్చలేదని సమాచారం. వీటికి పవన్ ఓకే అనగానే.. కండువా మార్చేందుకు త్రిమూర్తులు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో జంపింగ్ సీజన్ నడుస్తోంది. ఇలాంటి టైమ్‌లో త్రిమూర్తులు తీరు.. కొత్త చర్చకు దారి తీస్తోంది.