జగన్ నాకు అన్యాయం చేయలేదు.. అందుకే గ్యాప్ వచ్చింది: ఎమ్మెల్పీ వంశీకృష్ణ

జగన్ నాకు అన్యాయం చేయలేదు.. కానీ నాకు ప్రయారిటీ ఇవ్వలేదు. కొంత మంది దుర్మార్గమైన మాటలు వినడంతోనే గ్యాప్ వచ్చింది.

YSRCP MLC Vamsi Krishna Srinivas Yadav Comments on YS Jagan

MLC Vamsi Krishna Yadav: పవన్ కళ్యాణ్‌పై అభిమానం ఉన్న వారందరినీ జనసేనలో చేర్పిస్తానని, అందరికీ జనసేనలో సముచిత స్ధానం కల్పిస్తానని ఎమ్మెల్పీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అన్నారు. బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆయన జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 10టీవీతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే వైసీపీ నుంచి జనసేనలోకి మారినట్టు వెల్లడించారు. విశాఖ నుంచి జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని ఆయన అన్నారు.

”జగన్ వలన నాకు ఇబ్బంది లేదు. నా‌ కార్యకర్తలకు కొండంత‌ అండగా ఉంటా. జగన్ నాకు అన్యాయం చేయలేదు.. కానీ నాకు ప్రయారిటీ ఇవ్వలేదు. కొంత మంది దుర్మార్గమైన మాటలు వినడంతోనే గ్యాప్ వచ్చింది. నాకు నచ్చిన చోట పోటీ చేయాలనే పార్టీ మారాను. నన్ను గాజువాక నుంచి పోటీ చేయమన్నారు. విశాఖ సిటీలో ఎక్కడైనా పోటీ చేస్తానని చెప్పాను. గాజువాక నుంచే పోటీ చేయమన్నారు, నేను చేయనన్నాను. నాకు అవకాశం రాని చోట ఇంకొకరు మాట విన్నారు. నేను అడిగిన చోట సీటు ఇవ్వలేదనే పార్టీ మారాను. నేను అడిగిన సీటు జనసేన ఇస్తుందని ఆశిస్తున్నాన”ని ఎమ్మెల్పీ వంశీకృష్ణ యాదవ్ చెప్పారు.

కాగా, తమ పార్టీలో వంశీకృష్ణకు తగిన ప్రాధాన్యం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీయిచ్చారు. వంశీ నమ్మకాన్ని వమ్ముచేయబోమని, ఆయనకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. వంశీకృష్ణ లాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. ఉత్తరాంధ్రలో పార్టీలో బలోపేతానికి ఆయన పాటు పడాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వంశీకృష్ణ తమ పార్టీలో చేరడం ఆనందం కలిగిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

Also Read: వంశీకృష్ణను మనస్ఫూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నా: పవన్ కళ్యాణ్