తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తాజాగా ఏపీలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ వచ్చింది. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపురెడ్డి ప్రకాష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారు.
కరోనా బారిన పడ్డ మూడో వైసీపీ ఎమ్మెల్యే:
ఎమ్మెల్యే తోపుదుర్తితో పాటు ఆయన గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న 16 మందికి టెస్టులు చేశారు. వారి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో కరోనా బారిన పడిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు(విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్) ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి కరోనా బారిన మూడో వైసీపీ ఎమ్మెల్యే. ప్రజలతో నిత్యం మమేకవడం, ఏదో ఒక పని మీద వచ్చే ప్రజలను వెనక్కి పంపలేక వారిని కలవడం.. ఈ కారణాలతో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు:
ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు 9 లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 28,239 పరీక్షలు నిర్వహించడం ద్వారా.. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 477 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 6,988కు చేరింది. కొత్తగా 657 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 15,252కి చేరాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 2,036 ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించినవి 736. కొత్తగా ఆరుగురి మృతితో మొత్తం మరణాల సంఖ్య 193కి చేరింది. యాక్టివ్ కేసులు 8,071 ఉన్నాయి.