AP Bjp Mla Candidates : ధర్మవరం టికెట్ ఆయనకే- ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్ నాయకులకు మొండిచేయి ఎదురైంది. సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వలేదు. మాధవ్ కు కూడా అవకాశం లభించలేదు.

AP Bjp Mla Candidates : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..
ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వర రావు
విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు
అరకు లోయ – పంగి రాజారావు
అనపర్తి – ఎం.శివ కృష్ణం రాజు
కైకలూరు – కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
బద్వేల్ – బొజ్జా రోశన్న
జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
ఆదోని – పార్థసారథి
ధర్మవరం – వై.సత్యకుమార్

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్ నాయకులు కొందరికి మొండిచేయి చూపించింది. ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వలేదు. మాధవ్ కు కూడా అవకాశం లభించలేదు. మరో సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి సైతం టికెట్ దక్కలేదు. యువ మోర్చా మాజీ జాతీయ కార్యదర్శి సురేశ్ కు కూడా నిరాశే ఎదురైంది. కాగా, నిన్ననే టీడీపీ నుంచి బీజేపీలో చేరి బద్వేల్ టికెట్ దక్కించుకున్నారు రోశన్న.

కూటమి నుంచి ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? అనేది తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇక్కడ టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, బీజేపీ నుంచి వరదాపురం సూరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రధాని మోదీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బీజేపీ జాతీయ సెక్రటరీ సత్యకుమార్ కే ధర్మవరం టికెట్ దక్కింది. సత్యకుమార్ 34 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. మోదీ, అమిత్ షా సన్నిహితుడిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకుడిగా పని చేసి బీజేపీని గెలిపించారు.

టీడీపీ ప్రకటించిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..
కాగా, ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులు ఉన్నాయి. టీడీపీ ప్రకటించిన నియోజకవర్గాలకు కూడా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. అరకు వ్యాలీ, అనపర్తిలో ఇప్పటికే టీడీపీ తను అభ్యర్థులను ప్రకటించింది. ఆ రెండు స్థానాలకు బీజేపీ కూడా తన అభ్యర్థులను అనౌన్స్ చేసింది. అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి శివకృష్ణంరాజు పేర్లను ఖరారు చేసింది. ఇక, అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించి అరకునే తొలి స్థానంగా తన అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. అరకు టీడీపీ అభ్యర్థిగా దున్నుదొర పేరుని గతంలో ప్రకటించారు చంద్రబాబు. అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పేరుని ఖరారు చేశారు చంద్రబాబు.

Also Read : టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?

 

ట్రెండింగ్ వార్తలు