Visakhapatnam North Assembly Race Gurralu : ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే చాన్స్‌.. ఈసారి అక్కడ ఎగిరే జెండా ఏది?

ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్‌ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్‌ కనిపిస్తోంది.

Visakhapatnam North Assembly Race Gurralu : ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే చాన్స్‌.. ఏ ఎమ్మెల్యే కూడా రెండో సారి గెలిచిన చరిత్ర లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి.. మూడు ఎన్నికలు.. మూడు పార్టీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు… ఇదే ఆ నియోజకవర్గం ఆనవాయితీ.. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వెలువడనుంది. ఓ మాజీ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు నేతలు తలపడుతున్న విశాఖ నార్త్‌లో ఎగిరే జెండా ఏది?

అప్పట్లో కాంగ్రెస్ కు కంచుకోట..
సాగర నగరం విశాఖలో కీలక నియోజకవర్గం విశాఖ ఉత్తర. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకు ముందు విశాఖ రెండో నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. అప్పట్లో కాంగ్రెస్‌కు కంచుకోట. పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీయే ఇక్కడ జెండా ఎగరేసింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒకసారి బీజేపీ.. మరోసారి టీడీపీ విజయకేతనం ఎగరేశాయి. గత ఎన్నికల్లో కేవలం రెండు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని కోల్పోయిన వైసీపీ.. ఈ సారి ఉత్తర నియోజకవర్గంలో కాలుమోపి వాల్తేరులో సత్తా చాటాలని భావిస్తోంది.

కేవలం 2వేల ఓట్ల తేడాతో వైసీపీ ఓటమి..
పూర్తిగా అర్బన్‌ ప్రాంతమైన ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల ఓటర్లున్నారు. గవర, తూర్పు కాపు, కొప్పల వెలమ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. క్షత్రియులు, మైనారిటీలు కూడా చెప్పుకోదగిన స్ధాయిలోనే ఉన్నారు. రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఉత్తర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో గంటాకు 67 వేల 352 ఓట్లు వస్తే, వైసీపీ నేత కేకే రాజుకు 65 వేల 408 ఓట్లు వచ్చాయి. కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఈ నియోజకవర్గాన్ని కోల్పోయింది వైసీపీ. అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నియోజకవర్గంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఉత్తర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు.. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకుని పనిచేస్తూ పరపతి పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

వైసీపీ అభ్యర్థిపై ఓటమి సానుభూతి..
ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజుతోపాటు టీడీపీ మద్దతుతో బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరఫున సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్నా.. ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల నేతలూ క్షత్రియ సామాజికవర్గమే కావడంతో బీసీలే గెలుపోటములను డిసైడ్‌ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన కేకే రాజుపై నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తోంది. పైగా ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి రెండో చాన్స్‌ లేదనే సెంటిమెంట్‌ కూడా ఆయనకు సానుకూలంగా మారుతోంది.

సీఎం జగన్ అండదండలు..
గత పదేళ్లుగా వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్న కేకే రాజు పట్ల అధిష్టానం సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సీఎం జగన్‌ అండదండలతో నియోజకవర్గంలో తన బలం పెంచుకున్నారు కేకే రాజు. ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ, ఆయన గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో కే.కే రాజు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా.. నేనున్నానంటూ ఆదుకున్నారు. ఇక ఆయనకు ప్రోటాకాల్‌ సమస్యలు రాకుండా నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ పదవినిచ్చి మరింత ప్రోత్సహించింది వైసీపీ.

రాజకీయాల్లో అజాతశత్రువుగా గుర్తింపు..
ఇక అధిష్టానం సహాయ సహకారం, ప్రభుత్వ కార్యక్రమాలతో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు సృష్టించుకున్న కేకే రాజు ఈ ఎన్నికల్లో గెలుపుపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, ఆయనను ఢీకొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుకు కూటమి పార్టీల నుంచి సంపూర్ణ సహకారం అందుతోంది. తొలి నుంచి టీడీపీపై సానుకూల వైఖరి ప్రదర్శించడం, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి షిప్ట్‌ అవ్వడం వల్ల నాయకత్వంపై ఎలాంటి సమస్య లేకపోయింది.

సెంటిమెంట్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో?
ఇదే సమయంలో విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ స్వయంగా నార్త్‌ ఇన్‌చార్జిగా ఉండటం కూడా విష్ణుకు అడ్వాంటేజ్‌గా మారింది. 2014లో కూటమి అభ్యర్థిగా గెలిచిన విష్ణుకుమార్‌రాజు.. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తలపడుతున్నారు. ఐతే ఈ నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా తిరుగుతున్న విష్ణుకుమార్‌ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు.

ఒక్క ఛాన్స్ అంటున్న మాజీ జేడీ..
ఇలా ప్రధాన పార్టీలు రెండు నార్త్‌లో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతుంటే.. సమరానికి నేనూ సిద్ధమే అంటూ ఉవ్విళ్లూరుతున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకున్నారు. ఎన్నికల అనంతరం జనసేనకు దూరమై.. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సొంతంగా జైభారత్‌ నేషనల్‌ పార్టీని ప్రారంభించారు లక్ష్మీనారాయణ. విశాఖలో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా.. తాను స్వయంగా విశాఖ నార్త్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు లక్ష్మీనారాయణ.

వైసీపీ, టీడీపీ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్న మాజీ జేడీ..
మొత్తానికి ఉత్తర సమరం హోరాహోరీగా కనిపిస్తోంది. ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా.. గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్‌ చేసి పనిచేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్‌ కనిపిస్తోంది. ప్రధానంగా పట్టణ ఓటర్లు కావడం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లు గుంబనంగా వ్యవహరిస్తున్నారు. ఐతే గతంలో టీడీపీ నుంచి గంటాను ఎన్నుకోవడం వల్ల ఎలాంటి మేలు జరగలేదని.. ఆయన ఎప్పుడూ నియోజకవర్గంలో అందుబాటులో లేరని.. అందుకే ఈ సారి సీటు మారారని వైసీపీ చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ ప్రచారాన్ని బీజేపీ తిప్పకొట్టగలదా? లేదా? అనేదే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనుంది.

Also Read : వైసీపీ ఎన్నికల ప్రణాళికపై ఆసక్తికర చర్చ.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా మ్యానిఫెస్టో..?!

ట్రెండింగ్ వార్తలు