YSRCP Manifesto 2024 : వైసీపీ ఎన్నికల ప్రణాళికపై ఆసక్తికర చర్చ.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా మ్యానిఫెస్టో..?!

మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

YSRCP Manifesto 2024 : వైసీపీ ఎన్నికల ప్రణాళికపై ఆసక్తికర చర్చ.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా మ్యానిఫెస్టో..?!

ys-jagan-new-manifesto-to-be-release-after-bus-yatra-for-ap-elections-2024

YSRCP Manifesto 2024 : గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం… ఈ ఎన్నికలకు ఎలాంటి మ్యానిఫెస్టో ఇవ్వనుంది. సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా నిలిచిన సీఎం జగన్‌.. వచ్చే ఎన్నికలకు ఇచ్చే వరాలు ఏంటి? ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో ఇదే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక సీఎం జగన్‌ కూడా మ్యానిఫెస్టోపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఓ వైపు బస్సు యాత్రలో బిజీబిజీగా ఉన్నా.. ఈ సారి పేదలతోపాటు మధ్య తరగతి జనాలను అక్కున చేర్చుకునే పథకాలపై ఫోకస్‌ పెట్టారంటున్నారు.

Read Also : AP Elections 2024: ఇక్కడ ఎవరు గెలిచినా ఓ సంచలనమే..

బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన :
పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ రాష్ట్రంలో పొలిటికల్‌ టెంపరేచర్‌ పెరిగిపోతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో పార్టీలు మ్యానిఫెస్టోపై ఫోకస్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్లుగా సంక్షేమ ప్రభుత్వం నడిపిన వైసీపీ… ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక ఆవిష్కరిస్తుందనేదే హాట్ డిబేట్‌గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని 99 శాతం అమలు చేసేసిన వైఎస్సార్‌సీపీ.. ఇప్పుడు ఎలాంటి వరాలు ప్రకటిస్తుందనే ఉత్సుకత ఎక్కువగా కనిపిస్తోంది. బస్సుయాత్రలో బిజీబిజీగా ఉన్న సీఎం జగన్‌ మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై తుది దశ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధం సభల వేదికగానే మ్యానిఫెస్టో ప్రకటన ఉంటుందని తొలుత భావించినా.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి? : 
గ‌త ఎన్నిక‌ల ముందు న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌పై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. CM జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు.. న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌ అమ‌లులో త‌న చిత్తశుద్ధి చాటుకున్నారు. దీంతో ఈ సారి నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా మ్యానిఫెస్టో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు. నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా.. ఈ సారి పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాల సమాచారం. మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు.

గ‌తంలో కంటే ప్రతి విష‌యంలోనూ అధిక ల‌బ్ధి క‌లిగించేలా మేనిఫెస్టో వుంటుంద‌ని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ కావడం ఖాయమంటున్నారు. హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వరస్ట్ ట్రాక్ రికార్డుంది. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అలా కాదు. అధికారం చేపట్టాక 2019 మేనిఫెస్టోలోని 99.5% హామీలు అమలు చేశారాయన. దీంతో.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం జనాల్లో బాగా పేరుకుపోయింది. అందుకే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో  అంత ఆసక్తి ఏర్పడింది.

Read Also : YS Jagan: చంద్రబాబుకి ఆ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది: జగన్