AP Elections 2024: ఇక్కడ ఎవరు గెలిచినా ఓ సంచలనమే..

సమయం తక్కువగా ఉండటం వల్ల బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి.

AP Elections 2024: ఇక్కడ ఎవరు గెలిచినా ఓ సంచలనమే..

ఏపీలోని కీలక స్థానాల్లో ఆ నియోజకవర్గం ఒకటి.. ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఆ నియోజకవర్గమే కేంద్ర బిందువు. అక్కడ ఎవరు గెలిచినా ఓ సంచలనమే… ఇద్దరు బడా నేతలు బరిలోకి దిగుతున్న ఆ స్థానం రిజల్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజకీయ ఉద్దండులైన ఆ ఇద్దరు నేతలు తొలిసారిగా పరస్పరం తలపడుతుండటంతో ఎవరిది పైచేయి అవుతుందనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇంత హైటెన్షన్‌ ఉన్న ఆ నియోజకవర్గం ఏది…? అక్కడ పోటీ పడుతున్న నేతలు ఎవరు?

ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు బడా నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి… ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లిలో అధికార, విపక్షాలకు స్పష్టమైన ఓటుబ్యాంకు ఉంది. సుమారు రెండు లక్షల ఓటర్లు ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది.

అధికార పార్టీ నుంచి సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షం తరఫున మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. ఈ నియోజకవర్గం వరకు ఈ ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ… ఆయా పార్టీల్లో అగ్ర నేతలు కావడంతో క్యాడర్‌ సంపూర్ణంగా సహకరిస్తున్నారు…. విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.

అగ్ర నేతల్లో ఒకరు..
అధికార వైసీపీ అగ్ర నేతల్లో బొత్స ఒకరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన చెప్పిందే శాసనం… ఇక చీపురుపల్లి ఆయన సామ్రాజ్యం. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా అంతా బొత్స కనుసన్నల్లో కొనసాగాల్సిందే… 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నేతల్లో ఒకరుగా ఎదిగిన బొత్స… తన రాజకీయానికి చీపురుపల్లినే అడ్డాగా చేసుకున్నారు. 2004లో తొలిసారిగా చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లోనూ బొత్స స్పీడ్‌ కొనసాగింది. ఐతే 2014లో రాష్ట్ర విభజన పరిణామాల వల్ల తొలిసారిగా ఓటమి చెందారు బొత్స. కానీ, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ కాంగ్రెస్‌ నేతకు రాని విధంగా సుమారు 43 వేల 9 వందల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు బొత్స.

ఓ విధంగా చెప్పాలంటే ఈ ఓట్లన్నీ బొత్స వ్యక్తిగత ఓటు బ్యాంకు….. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు వెయ్యి, రెండు వేల ఓట్లకే పరిమితమవగా, బొత్స మాత్రమే భారీగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన బొత్స… మళ్లీ విజయం సాధించి చీపురుపల్లిలో తనకు ఎదురులేదని నిరూపించారు. ఈ ఎన్నికల్లో కూడా తాను విజయం సాధించాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నారు బొత్స.

గత ఎన్నికల్లో విజయం సాధించిన బొత్స… అంతకు ముందెన్నడూ లేనివిధంగా సుమారు 26 వేల ఓట్ల ఆధిక్యంతో వైసీపీ జెండా ఎగరేశారు. చీపురుపల్లి నుంచి గెలిచిన తొలిసారే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స…. నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు. 1980వ దశకం నుంచి కలగా మిగిలిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి పథకంతో ఇప్పటికీ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు.

అభివృద్ధి, సంక్షేమంతోపాటు వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షంలో బొత్సను ఢీకొట్టే నేతే లేకుండా పోయారు. దీంతో బొత్స ప్రత్యర్థులుగా పక్క జిల్లా నేతలను తెస్తోంది టీడీపీ. ఐతే ఈ ప్రయోగం ఒకసారి ఫలించినా… అప్పట్లో వైసీపీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్ల చీలిక వల్లే టీడీపీ విజయం సాధించిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బొత్సను ఢీకొట్టడం టీడీపీకి సాధ్యమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బొత్సకు చెక్‌ పెట్టాలని
రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగిన బొత్సకు చెక్‌ పెట్టాలని టీడీపీ ఎంతో ప్రయత్నించింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్లస్‌ బొత్స ఓటు బ్యాంకు కలిపి చూస్తే సుమారు 90 వేల ఓట్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇదేసమయంలో టీడీపీకి గత రెండు ఎన్నికల్లో 62 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలం కూడా సుస్థిరమే. ఐతే గత రెండు ఎన్నికల్లో సుమారుగా 62 వేల ఓట్లు తెచ్చుకున్న టీడీపీ…. ఒకసారి బొత్సను ఓడించగలిగింది. అవే ఓట్లుతో రెండోసారి ఓడిపోయింది.

అంటే టీడీపీ బలం పెరగపోయినా…. 2014లో ఓట్ల చీలికతోనే బొత్స ఓడిపోయారని స్పష్టమవుతోంది. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం ఈ సారి ఓటుబ్యాంకు పెంచుకునే విషయమై తీవ్ర కసరత్తు చేస్తోంది. పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. బొత్సకు దీటైన నేతను బరిలోకి దించాలనే ఆలోచనతో నియోజకవర్గ ఇన్‌చార్జి నాగార్జునను తప్పించి…. సీనియర్‌ నేత కిమిడి కళావెంకటరావును తెరపైకి తెచ్చింది.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కళావెంకటరావుది ప్రత్యేక చరిత్ర. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న కళా… మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఓ విధంగా చెప్పాలంటే బొత్స కన్నా రాజకీయంగా సీనియర్‌. ఆయన సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వు కావడంతో గత మూడు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేశారు కళా. 2009, 2019 ఎన్నికల్లో ఓడిపోగా, 2014లో మాత్రం విజయం సాధించారు.

బీజేపీకి కేటాయించడంతో..
ఐతే ఈ సారి ఆ నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో చీపురుపల్లికి వచ్చారు కళా. ఈ నియోజకవర్గంలో కళా సామాజికవర్గం ఎక్కువగా ఉండటం, బొత్స మాదిరి రాజకీయాల్లో డక్కామొక్కీలు చూసిన నేత కావడంతో తక్కువ కాలంలోనే దూకుడు ప్రదర్శిస్తున్నారు కళా. కానీ, వైసీపీకి బొత్సతోపాటు జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ వంటి నేతలతోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీల బలం… బలగం ఎక్కువ. ఇదే సమయంలో టీడీపీలో బలమైన నేతలు అసలు కనిపించడం లేదు.

దీంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌ కళాకు సవాల్‌గా మారనుంది. టికెట్‌ దక్కించుకున్న నాటి నుంచి కుమారుడు రామ్‌మల్లిక్‌ నాయుడితో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నా…. ఆయనకు ఈ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడం… ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకుల మాటలకే ఆయన తల ఊపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోంది. ఐతే తాను వచ్చిన తక్కువ కాలంలోనే నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నానని… ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు కళా…

గట్టి నమ్మకంతో..
మొత్తానికి ఇటు బొత్స… అటు కళా… ఇద్దరూ తమ విజయంపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంతో అనుబంధం ఏర్పరుచుకున్న బొత్స నాలుగో విజయం నమోదు చేయాలని గట్టిగానే కృషి చేస్తున్నారు. అటు కళా మాత్రం నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే రాజకీయం మొదలుపెట్టారు.

సమయం తక్కువగా ఉండటం వల్ల బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రతిష్ఠ పెంచుకోవాలని చూస్తున్నారు కళా. చీపురుపల్లిలో గెలుపు వ్యక్తిగతంగా కళాకు ఎంత ముఖ్యమో… పార్టీపరంగా టీడీపీకి అంతే ప్రతిష్టాత్మకం…. మరి ఓటర్లు ఏం చేస్తారో.. ఎవరికి పట్టం కడతారో చూడాల్సివుంది.

Also Read: రాజంపేటలో హోరాహోరీ సమరం.. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం