Bjp Mla Candidates List : టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! ఆ రెండు సీట్లకు అభ్యర్థుల ప్రకటన

కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అనపర్తి సీటును అడుగుతున్నట్లు ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా అరకు కూడా బీజేపీ జాబితాలో చేరడమే చర్చక దారితీసింది.

Bjp Mla Candidates List : బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టీడీపీకి టిస్టులు ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన రెండు నియోజకవర్గాలకు తాజా లిస్టులో అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకటి అరకు, మరొకటి అనపర్తి. కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అనపర్తి సీటును అడుగుతున్నట్లు ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా అరకు కూడా బీజేపీ జాబితాలో చేరడమే చర్చకు దారితీసింది.

ఏపీ అసెంబ్లీకి 10 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. అయితే, అనూహ్యంగా 10 మందిలో నలుగురు కొత్త వారికి టికెట్లు ఇవ్వడమే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న నేతలను సైతం అసెంబ్లీకి పరిమితం చేయడం సంచలనంగా మారింది. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపారు. అయితే, సుజనాకు విజయవాడ వెస్ట్, సత్యకుమార్ కు ధర్మవరం నుంచి అసెంబ్లీ టికెట్లు ఖరారు చేసింది బీజేపీ.

ఇక ఎచ్చెర్ల నుంచి నడికుదిటి ఈశ్వరరావు, అరకులోయ నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి శివకృష్ణంరాజు, ఆదోని నుంచి పార్థ డెంటల్ పార్థసారథికి టికెట్ ఇచ్చింది బీజేపీ. అయితే అరకు, అనపర్తి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించడమే పెద్ద చర్చకు దారితీసింది. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా దున్ను దొరను అందరికంటే ముందే ప్రకటించారు చంద్రబాబు. కూటమిలోని జనసేన కూడా అరకు నుంచి టీడీపీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, అరకు బహిరంగ సభలో దున్ను దొర పేరు ప్రకటించాల్సిన పరిస్థితిని అర్థం చేసుకుని చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించింది.

అదే విధంగా ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మాజీ సైనికుడు శివకృష్ణం రాజును బరిలోకి దింపింది బీజేపీ. దీంతో బీజేపీ తీసుకున్న రెండు స్థానాలకు బదులు టీడీపీకి ఏ స్థానాలను తిరిగి ఇస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. అల్లూరి జిల్లాలోని అరకు బీజేపీలో ఖాతాలో చేరడంతో అదే జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ రెండు జాబితాల్లోనూ పాడేరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు పాడేరు బదులుగా అరకు నుంచి బీజేపీ పోటీ చేస్తుండటంతో పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లైన్ క్లియర్ అయినట్లే అని చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ఆ నియోజకవర్గంలో పని చేస్తున్న గిడ్డి ఈశ్వరి.. పొత్తుల్లో భాగంగా సీటు త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, బీజేపీ ఆ స్థానం నుంచి పోటీకి వెనక్కి తగ్గడంతో అదృష్టం గిడ్డి ఈశ్వరి తలుపు తట్టినట్లు అయ్యింది. ఇక అనపర్తికి బదులుగా టీడీపీ ఏ సీటు తీసుకుంది అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

బీజేపీ ఆశించిన సీట్లలో దాదాపు అన్నింటికి టికెట్లు ప్రకటించింది. అయితే, టీడీపీ 6 సీట్లను పెండింగ్ లో పెట్టగా.. మిత్రపక్షాలకు కేటాయించిన అనంతపురం అర్బన్, పాడేరు కూడా ఇప్పుడు టీడీపీ జాబితాలోకి చేరాయి. దీంతో టీడీపీ 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 175 స్థానాలకు కూటమి 167 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయ్యింది. టీడీపీ ప్రకటించాల్సిన స్థానాలే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ 8 స్థానాల్లో చాలా చోట్ల సీనియర్లు టికెట్లు ఆశిస్తుండటంతో ఎవరికి టికెట్ దక్కుతుందో? ఎవరికి హ్యాండ్ ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు