టీడీపీ థర్డ్ లిస్ట్.. విద్యాధికులకు పెద్దపీట, ఎంత మంది ఉన్నారంటే?

మరో 4 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా మొత్తం 9 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

TDP 3rd List: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో థర్డ్ లిస్ట్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 139 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్టైంది. మరో 4 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా మొత్తం 9 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం లేదా రాజంపేట పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించే అవకాశముంది.

సీనియర్లకు మరోసారీ
తాజా జాబితాలో చోటు దక్కని ఆశావహులు నాలుగో లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుకు మరోసారి ఎదురుచూపులు తప్పడం లేదు. నాలుగు జాబితాలో తమకు కేటాయిస్తారని వీరంతా ఆశాభావంతో ఉన్నారు. చీపురుపల్లి నుంచి గంటాను బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే విశాఖను విడిచిపెట్టేందుకు ఆయన సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది.

ఎవరికెన్ని సీట్లు?
బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కలిపి 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ.. కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది.

Also Read: ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసా?

టీడీపీ మూడో లిస్టులో..
తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించిన 13 మంది ఎంపీల్లో నలుగురు బీసీలకు అవకాశం కల్పించారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల్లో విశ్రాంత అఖిలభారత సర్వీస్ అధికారులు 2, వైద్యులు 2, పీజీ చదివిన వారు 3, గ్రాడ్యుయేట్లు ఆరుగురు ఉన్నారు. 13 మంది ఎంపీ అభ్యర్థుల్లో ఒక మహిళకు మాత్రమే చోటు దక్కింది.

25 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు ఇద్దరు.. 36 నుంచి 46 మధ్య వయస్కులు ఐదుగురు ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు ఇద్దరు.. 61 నుంచి 75 ఏళ్ల వయస్కులు నలుగురు ఉన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల్లో..
ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 9 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు, గ్రాడ్యుయేట్స్ ఇద్దరు, ఇంటర్మీడియట్ ఇద్దరు, టెన్త్ బిలో ముగ్గురు, ఒకరు వైద్యులు ఉన్నారు. 36 నుంచి 45 మధ్య వయస్కులు ఇద్దరు.. 46 నుంచి 60 ఏళ్ల వయసు వారు ఆరుగురు.. 61 నుంచి 75 ఏళ్ల వయస్కులు ముగ్గురు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు