Ananthapuramu Race Gurralu : టీడీపీ, వైసీపీ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్న గ్రూప్ వార్‌.. అనంతపురం అర్బన్‌లో ఆసక్తికర పోరు

ఎన్నికల యుద్ధంలో సొంత వారిని దారికి తెచ్చుకోవడమే ఆ నేతలకు ప్రధాన సమస్యగా మారింది.

Ananthapuramu Race Gurralu

Ananthapuramu Race Gurralu : ఎన్నికల సమయంలో అలకలు, అసంతృప్తులు ఎదుర్కోని నేతలు ఉండరు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ప్రతి నేత ఎదుటి పార్టీల్లో గ్రూపులు ప్రోత్సహిస్తుంటారు. తెరవెనుక రాజకీయం చేసి తాము లబ్ధి పొందాలని చూస్తుంటారు. కానీ, ఆ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నేతలకు గ్రూపుల తలనొప్పి తప్పడం లేదు. ఎన్నికల యుద్ధంలో సొంత వారిని దారికి తెచ్చుకోవడమే ఆ నేతలకు ప్రధాన సమస్యగా మారింది. మరి రెబల్స్‌ను బుజ్జగించడం ఎలా? విజేతగా నిలవడం ఎలా?

రెండు పార్టీల్లోనూ అసమ్మతి, అసంతృప్త నేతల సెగ..
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఊహించని ట్విస్టులు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఎప్పుడూ కూల్‌గా ఉండే అనంతపురంలో ఈ ఎన్నికలు మాత్రం చాలా హాట్‌గా మారాయి. వేసవి ఎండలు తోడైనట్లు రెండు పార్టీల్లోనూ అసమ్మతి, అసంతృప్త నేతల సెగ ఎక్కువవుతోంది. దీంతో అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలను దారికి తెచ్చుకోడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరోసారి బరిలో దిగబోతున్నారు. నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకట్రామిరెడ్డిని సక్సెస్ ఫుల్ లీడర్‌గా చెబుతారు.

వారు వెంకట్రామిరెడ్డికి సహకరిస్తారా?
ఐతే ఈ ఎన్నికల్లో ఆయనకు సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ముగ్గురు నలుగురు నాయకులు పని చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించారని.. కానీ, సీఎం జగన్‌ మాత్రం అనంత వెంకట్రామిరెడ్డిపైనే విశ్వాసం చూపించారంటున్నారు. టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడిన నాయకులు వెంకట్రామిరెడ్డికి సహకరిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే ముందు అతిపెద్ద సవాల్..
గత ఐదేళ్లలో నగరాన్ని అభివృద్ధి చేయడంలో సక్సెస్ అయ్యారు అనంత వెంకట్రామిరెడ్డి. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించారు. రహదారుల రూపురేఖలు మార్చారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు ఎమ్మెల్యే. ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేవు. కానీ, సొంత పార్టీలో కొందరు నేతల తీరే సందేహాలు రేకెత్తిస్తోంది. వీరిని ప్రసన్నం చేసుకోవడమే ఎమ్మెల్యే ముందున్న టార్గెట్‌. వీరిని దారికి తెచ్చుకుంటే ఎన్నికల్లో సగం పని పూర్తి చేసినట్లేనంటున్నారు.

ఆర్థికంగా బలవంతుడు..
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే.. అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాప్తాడు నియోజవర్గానికి చెందిన దగ్గపాటి ప్రసాద్‌ ఎంపికయ్యారు. మాజీ ఎంపీపీ అయిన ప్రసాద్‌ ఆర్థికంగా బలవంతుడు. దీంతో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని వెనక్కి నెట్టి టికెట్‌ తన్నుకుపోయారు దగ్గుపాటి ప్రసాద్‌. అనంతపురం టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాకర్‌ చౌదరితోపాటు మరికొందరు నేతలు ప్రసాద్‌ అభ్యర్థిత్వంపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రసాద్‌కు టికెట్‌ ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయాలపై అటాక్‌ చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు టీడీపీ కార్యకర్తలు.

అసంతృప్తులు ఎంతవరకు సహకరిస్తారు?
కానీ, అధిష్టానం ప్రసాద్‌ వైపే నిలబడటంతో మిగిలిన నేతలు అంతా స్తబ్దుగా ఉండిపోయారు. వీరిని కలుపుకుని వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్‌. ఇక చంద్రబాబు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని పిలపించి మాట్లాడటంతో కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారు. కానీ, అసంతృప్తులు ఎంతవరకు పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అందరిని కలుస్తున్న దగ్గుపాటి ప్రసాద్‌.. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూడు వర్గాలను ఆకట్టుకుంటేనే ఫలితం అనుకూలం..
ఇలా ఇరు పార్టీల్లో అభ్యర్థులకు తలనొప్పులు ఉండగా, గ్రూప్‌ వార్‌ను అధిగమించే వారే విజయానికి దగ్గరగా ఉంటారనే విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. నగరంలో 50 డివిజన్లు ఉండగా, 49 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. నియోజకవర్గంలోని ఉన్న 3 పంచాయతీల్లోనూ వైసీపీయే అధికారంలో ఉంది. ఇలా సంస్థాగతంగా అధికార పార్టీ చాలా స్ట్రాంగ్ కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు. అయినప్పటికీ వైసీపీని ఢీకొట్టడం టీడీపీకి సవాల్‌గానే చెబుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మైనార్టీలు, బలిజ ఓటర్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ. ఈ మూడు వర్గాలను ఆకట్టుకుంటేనే ఫలితం అనుకూలంగా ఉంటుందంటున్నారు. మరి ఈ పని ఎవరు చేస్తారు? సొంత పార్టీ ఇబ్బందుల నుంచి బయటపడి ఓట్ల వేటలో ఎవరు సక్సెస్‌ అవుతారన్నదే ఆసక్తిరేపుతోంది.

Also Read : గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ఓడిన కాపుల కోటలో ఈసారి గెలుపెవరిది?

 

ట్రెండింగ్ వార్తలు