Bhimavaram Assembly Constituency : గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ఓడిన కాపుల కోటలో ఈసారి గెలుపెవరిది?

2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

Bhimavaram Assembly Constituency : గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ఓడిన కాపుల కోటలో ఈసారి గెలుపెవరిది?

Big Fight In Bhimavaram

Bhimavaram Assembly Constituency : రాష్ట్రంలో హైవోల్టేజ్‌ వార్‌ జరిగే నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్‌కు కంగు తినిపించిన భీమవరంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? పొత్తులతో ఉమ్మడిగా పోటీ చేస్తున్న టీడీపీ-జనసేన పార్టీలు ఎలాంటి సవాల్‌ విసురుతున్నాయి. భీమవరంలోనే పోటీ అంటూ తొలి నుంచి చెప్పుకొచ్చిన జనసేనాని పవన్‌ చివర్లో ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇంతకీ భీమవరం ఏ పార్టీకి వరమిస్తుంది?

ఊహకందని రీతిలో భీమవరం రాజకీయాలు..
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం రాజకీయ పరిణామాలు ఉహకందని విధంగా మారుతుంటాయి. గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌ పోటీ చేయడం… ఈ ఎన్నికల్లో కూడా పవన్‌ పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో భీమవరంపై అన్ని పార్టీలూ ఫోకస్‌ ఎక్కువగా చేశాయి. చివరికి పవన్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా.. భీమవరాన్ని మాత్రం ఏ ఒక్కరూ లైట్‌గా తీసుకోవడం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ ఉత్కంఠ పెంచుతోంది.

పట్టు కోల్పోయిన టీడీపీ..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా భీమవరం నియోజకవర్గం ఉండేది.. వివిధ కారణాలతో ఇటీవల కాలంలో పట్టు కోల్పోయింది పసుపుదళం. టీడీపీ బలహీనపడటంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి గ్రంధి శ్రీనివాస్‌ పోటీచేస్తుండగా, ఆయన ప్రత్యర్థిగా జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బరిలోకి దిగారు. రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు.. ఇటీవల జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు.

భీమవరంలో ఎవరు గెలిస్తే వారిదే అధికారం..!
నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 51 వేల 301 ఓట్లు ఉన్నాయి. భీమవరం పట్టణంతోపాటు భీమవరం రూరల్‌, వీరవాసరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తారు. క్షత్రియ సామాజిక వర్గ నేతలు, కాపులే భీమవరం ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటింగ్ శాతమే ఎక్కువ. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో భీమవరం ఒకటి కావడంతో ఈ నియోజకవర్గానికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఇక భీమవరంలో గెలిచే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే చాన్స్‌ ఉందనే సెంటిమెంట్‌ కూడా ఈ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్‌ చేయడానికి కారణమవుతోంది.

8వేల ఓట్లతో వైసీపీ సంచలన విజయం..
గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్‌ సంచలన విజయం సాధించారు. జనసేనాని పవన్‌ను ఓడించడంతో ఎమ్మెల్యే గ్రంధికి ఎంతో ప్రాధాన్యం లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం కూడా అందులో భాగమేనంటారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు 70 వేల 643 ఓట్లు రాగా, పవన్ కళ్యాణ్‌కు 62 వేల 288 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ తరఫున పోటీ చేస్తున్న రామాంజనేయులు 52 వేల ఓట్లు తెచ్చుకున్నారు. సుమారు 8 వేల ఓట్లతో గెలిచిన శ్రీనివాస్‌ మరోసారి పోటీకి సై అంటున్నారు.

జయాపజయాలను నిర్ణయించేది కాపులు, క్షత్రియులే..
ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల 50 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు ఓటర్లే సుమారుగా 80 వేల వరకు ఉంటారు. ఇక సుమారుగా 15 వేలు ఉండే క్షత్రియులు కూడా జయాపజయాలను నిర్ణయిస్తుంటారు. ప్రస్తుతం ప్రత్యర్థులుగా తలపడుతున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, జనసేన అభ్యర్థి రామాంజనేయులు ఇప్పటివరకు రెండేసి సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఈ ఇద్దరిలో ఎవరు నెగ్గినా మూడోసారి ఎమ్మెల్యే అయినట్లే లెక్క. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తుందని వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ బలంగా నమ్ముతున్నారు.

కూటమి మద్దతుతో విజయంపై ధీమా..
భీమవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు వైసీపీ హైకమాండ్‌ అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఇక జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విషయానికొస్తే టీడీపీ-జనసేన ఓటు బ్యాంకుపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. 2009లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు ఆ తర్వాత టీడీపీలో చేరి రెండోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో వెనకబడినా… ఈ సారి కూటమి మద్దతుతో మూడో విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు.

మొత్తానికి ఇరువురు విజయం సాధిస్తామని చాలా ధీమాగానే ఉన్నారు. ఈ ఇద్దరికి మద్దుతుగా కుటుంబ సభ్యులతోపాటు ఆయా పార్టీ క్యాడర్‌ చెమటోడ్చుతోంది. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

Also Read : చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?