చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?

బాబు టార్గెట్‌ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?

Kuppam Race Gurralu

Kuppam Assembly Constituency : చంద్రబాబు కోట… కుప్పంలో ఏంటి పరిస్థితి? వైనాట్‌ 175 అంటూ పెద్ద టార్గెట్‌ పెట్టుకున్న వైసీపీ… 175వ నెంబర్‌ నియోజకవర్గమైన కుప్పంపై ఎలాంటి స్కెచ్‌లు వేస్తోంది. చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? గత నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా తప్ప మరో జెండా… అజెండా ఎరుగని కుప్పం ఓటర్లు అధికార పార్టీ గాలానికి చిక్కుతారా? చంద్రబాబుకే మరోసారి జైకొడతారా? కుప్పంలో కనిపించబోయే సీనేంటి?

చంద్రబాబు టార్గెట్ లక్ష ఓట్ల మెజార్టీ..
కుప్పం…. తెలుగుదేశం పార్టీ కంచుకోట…. పార్టీ అధినేత చంద్రబాబుకు పెట్టని కోట. శత్రు దుర్భేద్యంగా చంద్రబాబు నిర్మించుకున్న కుప్పంలో ఈ సారి అసెంబ్లీ ఫైట్‌ తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు పసుపు జెండా తప్ప మరో జెండా ఎరుగరు కుప్పం ఓటర్లు. కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూనే మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు చంద్రబాబు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటివరకు ఏడుసార్లు వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. ఇప్పుడు 8వ సారి కుప్పంలో పోటీ చేయనున్నారు చంద్రబాబు. ఈ సారి భారీ టార్గెట్‌నే పెట్టుకున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి… నాలుగోసారి సీఎం అవ్వాలన్నది చంద్రబాబు పంతం.

చంద్రబాబు ఓటమికి వైసీపీ భారీ ప్రణాళిక..
ఇక వైసీపీ కూడా కుప్పంపై భారీ ప్రణాళిక రచిస్తోంది. కుప్పంలో చంద్రబాబును అష్టదిగ్బంధం చేసి అటు రాష్ట్రంలో అధికారం సాధించడమే కాకుండా…. కుప్పంలో తొలిసారి జెండా ఎగరేయాలని బలంగా కోరుకుంటోంది. యువనేత, ఎమ్మెల్సీ భరత్‌ను రంగంలోకి దింపింది. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ తండ్రి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రమౌళి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ టీడీపీ అధినేతకు సవాల్‌ విసురుతున్నారు.

టీడీపీ ఆవిర్బావం నుంచి కంచుకోటగా కుప్పం..
చిత్తూరు జిల్లాకు శివారున కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉండే నియోజకవర్గం కుప్పం. అందుకే ఈ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంస్కృతులు సమ్మిళితంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి అతి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి ఎంతో దూరంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి కుప్పం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983, 1985ల్లో రంగస్వామినాయుడు వరుసగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, తన సొంత ఊరు చంద్రగిరి నుంచి 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు.. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి గెలుస్తూ వచ్చారు చంద్రబాబు. మూడు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు.

వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓటింగ్ ఎక్కువ..
కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం నాలుగు లక్షలకు పైగా జనాభా.. సుమారు రెండు లక్షల 20 వేల ఓటర్లు ఉన్నారు. వ్యవసాయం ఇక్కడి వారి ప్రధాన వృత్తి కాగా, నియోజకవర్గంలో సహజ వనరులు కూడా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరుకి అతి సమీపంలో ఉండటంతో యువత ఉపాధి కోసం బెంగళూరుపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. కుప్పంలో సామాజిక సమీకరణాల విషయానికొస్తే… ఇక్కడ బీసీల్లోని వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65 వేల నుంచి 70 వేలు ఓట్లు ఈ సామాజికవర్గానివే ఉన్నాయి.

చంద్రబాబు మెజార్టీని తగ్గించడంలో సక్సెస్‌ అయ్యారు..
ఇక ప్రత్యర్థి ఎవరైనా చంద్రబాబుదే ఇక్కడ పైచేయిగా వస్తోంది. వైసీపీకి ముందు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చేవారు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే కాంగ్రెస్ నేత 15 ఏళ్లపాటు చంద్రబాబును ఢీకొట్టారు. 2014లో వైసీపీకి సీన్‌లోకి రావడంతో చంద్రబాబుకు ప్రత్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తెరపైకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రమౌళికి అపజయమే ఎదురైంది. వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళి… చంద్రబాబు మెజార్టీని తగ్గించడంలో సక్సెస్‌ అయ్యారు.

టార్గెట్… లక్ష ఓట్ల మెజార్టీ
వాస్తవానికి చంద్రబాబు మెజార్టీ ప్రతి ఎన్నికకు తగ్గుతూ వస్తోంది. కానీ, విజయం మాత్రం బాబునే వరిస్తోంది. 1989 ఎన్నికల్లో చంద్రబాబుకు అత్యల్పంగా 6 వేల 918 ఓట్ల మెజారిటీ దక్కగా, 1999 ఎన్నికల్లో అత్యధికంగా 65 వేల 687 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక ఆ తర్వాత క్రమంగా చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ గత ఎన్నికల్లో 30 వేలకు వచ్చింది. ఐతే ఈసారి లక్ష ఓట్లు మెజార్టీ తెచ్చుకోవాలని టార్గెట్‌ పెట్టారు చంద్రబాబు.

చంద్రబాబు మెజార్టీని భారీగా తగ్గించడంలో ప్రధాన భూమిక..
చంద్రబాబు విజయపరంపరకు బ్రేక్‌ పడకపోయినా, వైసీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో బాబు ఆధిపత్యానికి చెక్‌ చెప్పే పరిస్థితికి ఎదిగింది వైసీపీ. 2014లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి…. 55 వేల ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో సుమారు 70 వేలు ఓట్లు కొల్లగొట్టారు. గత 35 ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి 50 వేల ఓట్లు రాలేదు. ఆ రికార్డును బద్ధలుకొట్టిన చంద్రమౌళి 50 వేల ఓట్ల మైలురాయిని దాటమే కాకుండా, బాబు మెజార్టీని భారీగా తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఐతే గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో… ఇప్పుడు ఆయన కుమారుడు భరత్‌ను రంగంలోకి దింపింది వైసీపీ. కుప్పం ఇన్‌చార్జి బాధ్యతలతోపాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నైతిక మద్దతు అందిస్తోంది.

చంద్రబాబును ఓడించడం అంత ఈజీ కాదు..
ఐతే కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే కుప్పంలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తుంది. కుప్పం అభివృద్ధిలో అడుగడుగునా చంద్రబాబు మార్కు కనిపిస్తుంది. నాలుగు మండలాల్లో గ్రామ గ్రామాన విశాలమైన రోడ్లు కుప్పం నియోజకవర్గ ప్రత్యేక ఆకర్షణ. అధునాతన ప్రభుత్వ భవనాలు కుప్పం సొంతం. ఇజ్రాయిల్ సేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను కుప్పం వాసులకు పరిచయం చేశారు చంద్రబాబు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల సైతం కుప్పంలో ఉంది. ఇదివరకు ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చంద్రబాబు కుప్పం వెళ్లేవారు. గత ఏడాదిన్నర కాలంగా మూడు నెలలకోసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. కుప్పం గ్రామస్థాయి నేతలతోనూ చంద్రబాబుకు నేరుగా సంబంధాలున్నాయి. వారిని పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును తమవాడిగానే భావిస్తుంటారు. కుప్పంకు ఎప్పుడు వచ్చినా తాను ఫుల్ రీఛార్జ్ అవుతానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు.

కుప్పంలో పుంజుకున్న వైసీపీ..
కుప్పంలో చంద్రబాబు ఎంత స్ట్రాంగ్‌ అయినా.. గత ఐదేళ్లలో అధికార బలంతో వైసీపీ కూడా పుంజుకున్నట్లే కనిపిస్తోంది. కుప్పం మున్సిపాలిటీతోపాటు పంచాయతీ ఎన్నికల్లో హవా చూపింది. చంద్రబాబు చిరకాల రాజకీయ శత్రువు, మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో టీడీపీ జోరుకు కళ్లేం వేయగలిగింది. టీడీపీ కంచుకోటల్లాంటి గ్రామాల్లో వైసీపీ అడుగులు వేసింది. 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పంకు ఏమీ చేయలేదంటూ వైసీపీ ప్రచారం మొదలెట్టింది.

చంద్రబాబు మెజార్టీ ఎంత?
మొత్తానికి కుప్పంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. బాబు టార్గెట్‌ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా టీడీపీ అధినేతకు సొంత నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థిని తయారు చేయడంలో వైసీపీ సక్సెస్‌ అయిందనే విశ్లేషణలు ఉన్నాయి. మరి ఈ బలం బాబును ఓడించేంత స్థాయిలో ఉందా? అనేది మాత్రం ప్రశ్నార్థకం. విశ్లేషణలు ఎలా ఉన్నా… పార్టీల అంచనాలు ఏవైనా సరే.. వరుసగా 8వ సారి పోటీ చేస్తున్న చంద్రబాబు మెజార్టీ ఎంతన్నదే అందరిలోనూ ఆసక్తి పుట్టిస్తోంది.

Also Read : ఏపీలో ఆ 30 కీలక నియోజకవర్గాల్లో బిగ్ ఫైట్? ఆ 30 ఏవి? అక్కడ పోటీ ఎలా ఉంది?